కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. తెలంగాణ రైతుల్ని కాంగ్రెస్ మోసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో రైతుల రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద వాగ్ధానాలు చేసిందని, కానీ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రైతుల్ని పట్టించుకోలేదని మోదీ తెలిపారు. తెలంగాణ రైతులు ఇప్పుడు రుణమాఫీ కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. తెలంగాణ రైతుల్ని పట్టించుకునేవారే లేరని ఆయన అన్నారు.అత్యంత అవినీతికర పార్టీ కాంగ్రెస్ అని మోదీ సీరియస్ అయ్యారు. తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ ఆ పార్టీని నడిపిస్తన్నట్లు ఆయన ఆరోపించారు. ఈ రోజు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తితో లింకున్న పార్టీ కాదు అని అన్నారు. పీఎం విశ్వకర్మ స్కీమ్‌కు ఏడాది పూర్తి అయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీలో ద్వేషమనే దెయ్యం ఎంటరైనట్లు ఆయన తెలిపారు. నేటి కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే శ్వాస లేదన్నారు.
కాంగ్రెస్ నేతలు యాంటీ ఇండియా ఎజెండాను కొనసాగిస్తున్నారని, రిజర్వేషన్ వ్యవస్థపై అమెరికాలో వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేతను స్వంత పార్టీ నాయకులే తప్పుపడుతున్నారని ఆరోపించారు. అవినీతమమైన పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ పార్టీ కుటుంబీకులే .. అత్యంత అవినీతిపరులని మోదీ విమర్శించారు.గణపతి పూజను కూడా కాంగ్రెస్ పార్టీ ద్వేషిస్తుందన్నారు. గణపతి పూజకు వెళ్తే కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కర్నాటకలో గణపతి బప్పను చెరశాలలో వేశారని, ఓ విగ్రహాన్ని పోలీసు వ్యాన్‌లో పెట్టారని ఆయన పేర్కొన్నారు. గణపతి బప్పకు జరిగిన అవమానంపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాట్లాడడం లేదని, వాళ్లు తమ నోటిని కట్టేసుకున్నరాన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, మోసాలు.. అబద్దాలు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని, మహా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయాలు, అవినీతి కోసం కాంగ్రెస్ పార్టీ రైతుల్ని వాడుకున్నట్లు ఆరోపించారు.
రైతుల్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరో ఛాన్సు ఇవ్వకూడదని మోదీ అన్నారు. తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల ఎదుగుదలను కాంగ్రెస్ అడ్డుకున్నదని, ఈ కులాలను తొక్కిపెట్టిన కాంగ్రెస్‌ను పారద్రోలాలన్నారు.లబ్ధిదారులు కేవలం కార్మికులే కాకూడదని, వాళ్లు ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావాలన్నారు. టెక్స్‌టైల్ మార్కెట్‌ను ప్రపంచ వ్యాప్తం చేయాలన్న దీక్ష తమ ప్రభుత్వంలో ఉన్నట్లు చెప్పారు. భారతీయ సంప్రదాయ నైపుణ్యాన్ని దెబ్బీయాలని బ్రిటీష్ పాలకులు కుట్ర పన్నారని, కానీ మహాత్మా గాంధీ గ్రామీణ సంప్రదాయ స్కిల్స్‌కు ఊతం ఇచ్చారని, కానీ స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని పాలించినవాళ్లు విశ్వకర్మ వర్గీయులను విస్మరించినట్లు ప్రధాని మోదీ ఆరోపించారు.దీంతో ఆ రంగం కుదేలైందన్నారు. విశ్వకర్మ స్కీమ్‌తో గత ఏడాదిలో 20 లక్షల మంది లబ్ధి పొందారని, మరో 8 లక్షల మంది వివిధ స్కిల్స్‌లో శిక్షణ పొందినట్లు చెప్పారు. విశ్వకర్మ యోజన కేవలం ప్రభుత్వ పథకం కాదు అని, వేల సంవత్సరాల నైపుణ్యాన్ని దేశాభివృద్ధికి వాడుకోవాలన్నారు.