చేసిన తప్పులు తప్పకుండా వెంటాడుతాయని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఈ కొటేషన్ వైసీపీ నేతలకు అతికినట్టు సరిపోతుంది. వైసీపీ ఐదేళ్ల పాలనతో నేతలు ఇష్టా రాజ్యంగా చెలరేగిపోయారు. సింపుల్‌గా చెప్పాలంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయాల్సిన పనులన్నీ చేశారు. ఇప్పుడు ఇబ్బందులు పాలవుతున్నారు. తాజాగా తిరుమల వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతోందని ఓపెన్‌గా చెప్పేసింది. ఇప్పుడు వైసీపీ పెద్ద తలకాయలకు ఇబ్బందులు తప్పవన్నమాట.
తిరుమల వ్యవహారంపై వైసీపీ నేతలు అడ్డంగా ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించాలని జగన్ మొదలు మిగతా నేతలంతా బల్లగుద్ది మరీ చెప్పారు. జగన్ అయితే ఓ అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్రమోదీ, సీజేఐకి లేఖలు రాశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై అన్నివర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల రావడంతో చంద్రబాబు సర్కార్ రంగంలోకి దిగేసింది. సిట్ విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన, స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో తిరుమలలో జరిగిన అపవిత్రం, లడ్డూ కారణాలు, అధికార దుర్వినియోగం వంటి వ్యవహారాలపై దర్యాప్తు చేయనుంది. ఇందుకోసం ఐజీ స్థాయి అధికారిని నియమించనుంది. సిట్ రిపోర్టు ఆధారంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పకనే చెప్పేశారు. వైసీపీ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలని వాడుకున్నారని మొదటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ పార్టీలే కాదు చివరకు అక్కడికి వచ్చిన భక్తులు సైతం పదేపదే ఆరోపణలు గుప్పించిన సందర్భాలు కోకొల్లలు. దేవుడిపై నమ్మకం లేని వారిని ఛైర్మెన్లగా పెట్టారని, టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శలు జోరందుకున్నాయి. తిరుమల నుంచి ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి ప్రకటన. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి హయాంలో తిరుమల నిత్యం వివాదాలమయంగా మారింది. వైవీ సుబ్బారెడ్డి రెండుసార్లు ఛైర్మన్‌గా వ్యవహరించారు. నాలుగేళ్లపాటు ఈయనదే కొనసాగారు. టీటీడీ చరిత్రలో ఇంతకాలం ఛైర్మన్‌గా కొనసాగిన వ్యక్తి మరొకరు లేదు. అడ్డుగోలుగా నియామకాలు చేపట్టారు.అన్యమతస్తులను టీటీడీలోకి రప్పించారు. తిరుమల నిర్వీర్యం కావడానికి ఇదీ కూడా ఓ కారణమని భక్తులతోపాటు కూటమి సర్కార్ బలంగా నమ్ముతోంది. సింపుల్‌గా చెప్పాలంటే వైవీ హయాంలో భక్తులకు దేవుడ్ని దూరం చేశారు. టికెట్లను సైతం అమాంతంగా పెంచేశారు.ఇక భూమన కరుణాకర్‌రెడ్డి తక్కువకాలం టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. తిరుమలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని అంటున్నారు.
టీటీడీ నిధులను మళ్లించడం, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు నిర్ణయాలపై విమర్శలు వెళ్లువెత్తాయి.ఇక ధర్మారెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారాయన. వైఎస్, జగన్ హయాంలోనూ డిప్యూటేషన్‌పై వచ్చి తిరుమలను పాలించారు. జగన్‌పై కేసులు ఉండడంతో న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులకు దగ్గరుండి మరీ శ్రీవారి దర్శనాలు చేయించేవారనే అపవాదును మూటగట్టుకున్నారు. శ్రీవాణి ట్రస్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఘన కార్యాలు చేశారని నేతలు ఓపెన్‌గా చెబుతుంటారు. మొత్తానికి తిరుమల వ్యవహారంలో వైసీపీ పెద్ద తలకాయలు ఇరుక్కుంటున్నాయనే చెప్పవచ్చు.