తెలంగాణలోని ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను ‘స్కిల్ యూనివర్సిటీ’ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన విధివిధానాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాల మేరకు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఐటీఐలు/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. సిలబస్ అప్‌గ్రేడ్ చేసేందుకు నిపుణుల కమిటీ నియమించి, సూచనలు సలహాలు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే నైపుణ్య యూనివర్సిటీ సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో కార్మికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ వీసీ, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌తో సహా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇతర నియామకాలపై తుది నిర్ణయానికి వచ్చారు. ఈ యూనివర్సిటీలో భాగస్వాములయ్యే పారిశ్రామికవేత్తలను గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలకు తగ్గట్లుగా యువతలో ‘స్కిల్స్’ మెరుగుపరిచేందుకు అవసరమయ్యే చర్యలపై విధానపరంగా పలు నిర్ణయాలను ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్‌గా పదవీ విరమణ చేసిన వి.ఎల్.వి.ఎస్.ఎస్.సుబ్బారావు పేరును ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఇండియన్ ఎకనమిక్ సర్వీసుకు చెందిన సుబ్బారావు సుమారు మూడున్నర దశాబ్దాల పాటు కేంద్రంలో ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, పెట్రోలియం-నేచురల్ గ్యాస్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎం.ఎస్.ఎం.ఇ), వాణిజ్యం, మానవవనరులు ఇలా పలు విభాగాల్లో పనిచేశారు.
ఉన్నత విద్యావిభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేసినప్పుడు స్కిల్ కౌన్సిల్ ఇన్‌ఛార్జిగా ఆ రంగంలో కృషి చేశారని, అందుకే ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్‌గా పదవీ విరమణ చేసిన ఈయనను వీసీగా నియమించాలని నిర్ణయం తీసుకొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఛైర్మన్‌తో సహా 15 మంది సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను ఇప్పటికే ఛైర్మన్‌గా ఎంపియచేసని సంగతి తెలిసిందే. ఇక కో-ఛైర్మన్‌గా ఎం.శ్రీనివాస.సి.రాజును నియమించారు. సభ్యులుగా టీంలీజ్‌కు చెందిన మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్ చందాని(ఇన్ఫోఎడ్జ్), కల్లం సతీశ్ రెడ్డి(రెడ్డి లేబొరేటరీస్), సుచిత్ర ఎల్ల(భారత్ బయోటెక్), ఎం.ఎం.మురుగప్పన్(మురుగప్ప గ్రూప్), కేపీకృష్ణన్(కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి), పగిడిపాటి దేవయ్య(ఫిలాంత్రపిస్ట్)తో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వీసీ, ఇద్దరు డీన్‌లు, పరిశ్రమలు, విద్య, ఆర్థికశాఖ కార్యదర్శులు ఉంటారని తెలిసింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకడమిక్ కౌన్సిల్ కూడా ఉంటాయి.
మూడేళ్లలో 18 విభాగాలు..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ ‘స్కిల్ యూనివర్సిటీ;లో మూడు దశల్లో 18 రంగాలకు చెందిన విభాగాల్లో యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
➥ మొదటిదశలో ప్రధానంగా ఈ-కామర్స్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ & లైఫ్ సైన్సెస్, యానిమేషన్-విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, కన్‌స్ట్రక్షన్ రంగాలకు చెందిన స్కూళ్లు ప్రారంభించనున్నారు.
➥ ఇక రెండోదశలో ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డిజిటల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్-సెమీ కండక్టర్స్ మొదలైనవి ఉన్నాయి. మొదటి దశలో రెండువేల మందికి శిక్షణతో ప్రారంభించి రెండో దశలో 10 వేల మంది, మూడో దశలో 20 వేల మందికి పెంచాలన్నది లక్ష్యం. కోర్సును బట్టి శిక్షణ 3 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది.
రిజర్వేషన్ల ప్రకారమే ప్రవేశాలు..
రాష్ట్ర యువతకు ఉపాధి పొందడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల మాదిరిగానే.. ఇందులోనూ రిజర్వేషన్ల వ్యవస్థను పాటిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు బోధన రుసుములు ఇస్తామన్నారు. ఇతరులకు ఫీజు తగ్గించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గతంలో కొన్ని ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటు చేసినా.. వాటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించలేదు. కొద్దిమంది కోసం వర్సిటీలను ధారాదత్తం చేశారు. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా అన్ని అంశాలను మా ప్రభుత్వం బిల్లులో పొందుపరిచింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలు, మైనారిటీలకు పాలకమండలిలో సభ్యులుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు