జాతీయం ముఖ్యాంశాలు

జంతర్​ మంతర్​ కు చేరుకున్న రైతులు

పార్లమెంట్ వద్ద రాహుల్ గాంధీ నిరసన

మూడు సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం మరింత తీవ్రమైంది. జంతర్ మంతర్ వద్ద ధర్నా కోసం కదం తొక్కారు. అక్కడ ఈరోజు ‘కిసాన్ సంసద్ (రైతు సభ/పార్లమెంట్)’ను నిర్వహించనున్నారు. సింఘూ సరిహద్దు నుంచి బస్సుల్లో బయల్దేరి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిరోజూ 200 మంది జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ నిర్వహించనున్నారు. ఆగస్టు 9 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ ఆందోళనలు జరగనున్నాయి. షరతుల ప్రకారం కేవలం 206 మందికే పోలీసులు అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

సాగు చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని, చర్చలకు తాము సదా సిద్ధమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి ఉద్ఘాటించారు. అంశాలవారీగా చట్టాలపై చర్చిస్తామన్నారు. రైతు పార్లమెంట్ కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేశారు. రాజ్యసభలో దానిపై చర్చించాలని శిరోమణీ అకాలీదళ్ డిమాండ్ చేసింది.

కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జరిగిన హింసపై ప్రశ్నించగా.. ఆ దాడులతో తమకేం సంబంధమంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కిసాన్ పార్లమెంట్ లో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులను ఇస్తున్నామన్నారు. కాగా, ఢిల్లీలో అణువణువునా పోలీసులు నిఘాను పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గొడవలు జరిగే ప్రమాదమున్న ప్రాంతాల్లో స్టేషన్లను మూసేయాల్సిందిగా ఢిల్లీ మెట్రోకు పోలీసులు సూచించారు.