తెలంగాణ రాజకీయం

ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ పై క్లారిటీ....

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 4 నెలల కాలవ్యవధిలోనే 4,500 ఫోన్లు ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అందులో 80 శాతానికి పైగా ఎయిర్‌టెల్ కస్టమర్లే ఫోన్లు ఉన్నట్టు తెలిసింది. ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి కాంగ్రెస్‌కు చెందిన 90 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేశారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మిత్రులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు బయటపడింది. ట్యాపింగ్‌కు పాల్పడిన సమాచారాన్ని మొత్తం కూడా ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. టోటల్‌గా 340 జీబీల సమాచారాన్ని ఆయన ధ్వంసం చేసినట్టు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్‌కు గురైన వారి జాబితాలో బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ పేరు కూడా ఉన్నది. ఈటెల రాజేందర్ ఫోన్‌తోపాటు ఆయన గన్‌మెన్, పీఆర్‌వో, సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా చేసిన ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు., ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా.. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న భుజంగరావు, తిరుపతయ్య, ప్రణీత్ రావులు కీలక వివరాలు వెల్లడించారు. ట్యాపింగ్ చేసిన పరికరాలను, డేటాను ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు. ఇక ఈ వ్యవహారం గులాబీ బాస్ ఆదేశాలతో జరిగిందని, ఎస్ఐబీ చీఫ్‌గా పని చేసిన ప్రభాకర్ రావు పకడ్బందీగా ఈ పని చేయించారని నిందితులు విచారణలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఎస్ఐబీ అధికారుల్లో తమకు తెలిసిన.. తమకు నమ్మకస్తులైన అధికారులతో ఈ పనులు చేయించారని వివరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిలింగ్ కూడా చేశారని, బ్లాక్ మెయిలింగ్, ఎక్స్‌టార్షన్ కోసం కొందరు సీఐడీ అధికారులను ఉపయోగించినట్టు విచారణలో తేలింది.

ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల నుంచి డబ్బులను సీజ్ చేయడం, ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకుని ఆ రూట్‌లో వెళ్లుతున్న డబ్బును పట్టుకోవడం వంటివి చేసినట్టు నిందిత అధికారులు దర్యాప్తులో పేర్కొన్నారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకమీదికి వచ్చినప్పుడు ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇక్కడ లేరు. ఆయన వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లినట్టు సమాచారం ఇచ్చారు. త్వరలోనే తాను తిరిగి వస్తానని చెప్పారు. కానీ, ఆయన చెప్పిన సమయం గడిచినా రాలేదు. అక్కడి నుంచి హైకోర్టునూ ఆశ్రయించి అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. కానీ, న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ముందుగా ఇక్కడికి వచ్చి విచారణ ఎదుర్కోవాలని సూచించింది. ఆ తర్వాత కూడా ప్రభాకర్ రావు తెలంగాణకు తిరిగి రాలేదు.ఆయనను స్వదేశానికి తీసుకురావడానికి ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

ఈ కేసులో అసలు దోషులు ఎవరనేది తేలాలంటే ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించాల్సిందే అనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తున్నది. ఆధారాలన్నింటినీ ధ్వంసం చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావును దర్యాప్తు చేయడం కీలకంగా మారింది. ఆయనను తిరిగి స్వదేశానికి రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని, ఇందుకు సంబంధించిన పనుల్లో పోలీసులు మునిగిపోయినట్టు తెలిసింది.