తెలంగాణ ముఖ్యాంశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిసి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని, దీని ప్రభావంతో నేటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచనున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి. బుధవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో వాతావరణం పొడిగా ఉంటూ ఒక్కసారిగా మారిపోతుంది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, ఆదిలాబాద్, కొమురంభీం -ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురవనుండగా.. కొన్నిచోట్ల మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది.  

మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలో, దక్షిణ కోస్తాలో వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. లేకపోతే పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులకు అవకాశము ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో గాలులు వీచే అవకాశముంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురవనుంది. రాయలసీమలోనూ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, జిల్లాల్లో సెప్టెంబర్ 24న అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.