ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సస్పెండ్ దిశగా... కొలికపూడి

కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత.. అమరావతి టాపిక్ వస్తే చాలు టీవీ డిబేట్లలో ప్రత్యక్షమవుతారు. గ్రీన్ కలర్ తలపాగా కట్టుకుని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ చెలరేగేవారు .. అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్దత చూసి తెలుగుదేశం పార్టీ ఏరికోరి టికెట్ ఇచ్చింది. తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్ధి కరువయ్యారు. దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీమ్‌ని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికపూడ వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబునాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవ్‌లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు.

అమరావతి ఉద్యమనేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే గెలిచాక ఆయన తనలోని మరోకోణం చూపిస్తున్నారంట. సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన మహిళలను లైంగికంగా వేధింస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయంటున్నారు. అధికారం చేతిలో ఉందికదా అని రెచ్చిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేకాట శిబిరాల ఏర్పాటులో ఆయన ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నారంట. ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఇటీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్థాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యా యత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. అలానే ఎ.కొండూరుకు చెందిన ఒకరి దగ్గర ఎన్నికల కోసం కోటి రూపాయలు తీసుకున్న కొలికపూడి ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడి రూ.20లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోటు చెప్పుకోమని అన్నారట.

మహిళలు సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారంట. ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరడంతో ఇటు టీడీపీ కార్యకర్తల్లో అటు సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. వారంతా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే కొలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు ఛీ ఆ ఎమ్మెల్యే మాకొద్దు .. అంటున్నారు. అసలు కొలికపూడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి. తర్వాత మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడులను కలిసి ఫిర్యాదు చేశారు .. పార్టీకి నష్టం కలిగించడంతో పాటు కేడర్‌ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఆ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరినట్లు తెలిసింది.

అసలు ఆయన పనితీరు, ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు అనేదానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేసినట్లు చెప్తున్నారు. ప్రజలంతా కొలికపూడికి వ్యతిరేకంగా ఓటువేశారంట. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పారంట. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పార్టీ షోకాజ్ నోటీసులు కొలికపూడికి జారీచేసే అవకాశాలున్నట్లు సమాచారం. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో?