తెలంగాణ రాజకీయం

కేటీఆర్ లీగల్ నోటీసులు

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ కొండా సురేఖ ఆరోపించారు. టాలీవుడ్ కపుల్స్ నాగచైతన్య, సమంత విడిపోవడానికి సైతం కారణం కేటీఆర్ అని వ్యాఖ్యలు చేశారని, తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే కొండా సురేఖ తనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని మహిళా మంత్రికి పంపిన లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే.. చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని మహిళా మంత్రిని కేటీఆర్ హెచ్చరించారు. రాజకీయ కారణాలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం కొండా సురేఖ తన పేరును బద్నాం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మహిళ, అందులోనూ బాధ్యతగల మంత్రి అయి ఉండి కూడా మరో మహిళ పేరును, సినిమా నటుల పేర్లను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి యత్నించండం దురదృష్టకరం అన్నారు కేటీఆర్.

తనకు ఏ సంబంధం లేదని ఫోన్ ట్యాపింగ్ తో పాటు నటీనటుల విడాకులకు తనకు లింక్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. తన మంత్రి హోదాను కొండా సురేఖ దుర్వినియోగం చేశారు. ఏ ఆధారాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచురితం అయ్యాయి. మంత్రి అయి ఉండి సాక్షాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని ఆమెకు పంపిన లీగల్ నోటీసులలో కేటీఆర్ పేర్కొన్నారు. తోటి అసెంబ్లీ సభ్యుడనే సోయి లేకుండా తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. గతంలో ఇలాగే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ ఏడాది నాలుగో నెలలో నోటీసులు పంపిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన మహిళా మంత్రిని భారత ఎన్నికల సంఘం గట్టిగా హెచ్చరించిందని.. అయినా ఆమె తీరు మారలేదన్నారు.

తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం కొండా సురేఖ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. తాజాగా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లీగల్ నోటీసులు పంపించారు. తనపై అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని నోటీసులలో హెచ్చరించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక మాటలు మాట్లాడవద్దని మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సూచించారు.రాజకీయాల కోసం తమ వ్యక్తిగత విషయాలను వాడుకోవడం సరికాదని మంత్రి కొండా సురేఖకు నటుడు నాగార్జున సూచించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. విడాకులు తన వ్యక్తిగత విషయం అని నటి సమంత సైతం స్పందించారు. తనను రాజకీయాల్లోకి లాగవద్దని, సినీ పరిశ్రమలో ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని పోస్టులో సమంత రాసుకొచ్చారు.

మహిళా కమిషన్ పరిశీలన
కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించామని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని చెప్పారు. సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది. కానీ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు. అలాగే నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతం అని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది.కాగా  సమంతకు కొండా సురేఖ సారీ చెప్పినా  నిరసనలు ఆగడంలేదు. అక్కినేని కుటుంబానికి సపోర్ట్‌గా సెలబ్రిటీల వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ , నాని , చిరంజీవి, వెంకటేష్, యంగ్ హీరోలు విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, వరుణ్ తేజ్ స్పందించారు. ఆ అలాగే దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ కూడా దీని పై స్పందించారు.

ఇదిలా ఉంటే మంత్రి సురేఖకు లీగల్‌ నోటీసులు పంపనున్నారు అక్కినేని నాగార్జున.అలాగే వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని మా అసోసియేషన్ కూడా పేర్కొంది.  బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండము అంటూ లేఖాస్త్రం సంధించింది మా..   వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని PCC చీఫ్‌ మహేష్‌గౌడ్‌ అన్నారు.  కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న మహేష్‌గౌడ్  మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు