తెలంగాణ రాజకీయం

హైడ్రా‘ చట్ట బద్ధత పై ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ హర్షం

చెరువులు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం “హైడ్రా“ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం,  దానికి చట్ట బద్ధత కోసం తీసుకొచ్చిన ఆర్డినేన్స్ ను గవర్నర్ ఏమోదించడంపై ”ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్“ హర్షం వ్యక్తం చేసింది. గవర్నర్ లేవనెత్తిన పలు అనుమానాలను నివృత్తి చేసి ఆర్డినేన్స్ ఆమోదం నేపథ్యంలో కౌన్సిల్ అధ్యక్షులు ఎస్సీహెచ్ రంగయ్య ఆదివారం బాగ్ లింగంపల్లిలో విలేకరులతో మాట్లాడారు.  దశాబ్దాలుగా పర్యావరణ ఉద్యమకారులు, ప్రేమికులు ఆశించిన చెరువుల సంరక్షణకు రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా తీసుకురావడం అత్యంత సంతోషకరమన్నారు. మానవ జీవనాన్ని నిర్దేశించే ప్రకృతి చెరువుల దురాక్రమణతో మనుగడ కోల్పోయే ప్రమాదం నెలకొందన్నారు.  దశాబ్దాలుగా జరిగిన ప్రకృతి హననాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ద్వారా ఆపే ప్రయత్నం చేస్తుంటే కొందరు రాజకీయ ప్రేరేపితులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. చెరువులు కాపాడు కోవాల్సిన బాధ్యత  ఒక్క అధికార పార్టీది మాత్రమే కాదన్నారు.

రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధికోసం హైడ్రా ను అడ్డుకోవద్దని, హైడ్రా కూల్చివేతల కారణంగా నిజమైన పేదలు,  బాధితులు ఉంటే వారికోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని రంగయ్య  హితవుపలికారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క మూసీ నిర్వాసిత కుటుంబానికి కూడా ఇబ్బంది రానీయమన్న హామీ ని పార్టీలు,  హైడ్రా వ్యతిరేకులు గుర్తించాలన్నారు. హైదరాబాద్ మహా నగర కళ్యాణం కోసం అందివచ్చిన హైడ్రా రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణలో కీలకం కానుందని ఆయన  పేర్కొన్నారు.  మూసీ సుందరీకరణ,  చెరువుల ప్రక్షాళన మహానగరాన్ని కాలుష్యానికి దూరంగా ప్రపంచ నగర వరుసలో తొలి స్థానంలో నిలబెట్టే   అవకాశాన్ని హైడ్రా వ్యతిరేకులు మరువద్దని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వ్యవస్థ మనుగడ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ “హైడ్రా“ వ్యవస్థ ఒక అద్భుతంగా కౌన్సిల్ అధ్యక్షులు అభివర్ణించారు.  

కొందరి వ్యాపారం కోసం జరుగుతున్న  పర్యావరణాన్ని నాశనాన్ని ఇక నైనా ఆపక పోతే భావితరాలు క్షమించవని,  ఆ భావితరాల్లో మన వారసులు కూడా ఉంటారన్న నిజాన్ని మరువద్దని ఏ ఒక్కరూ మరువరాదని కోరారు.  అంతేగాకుండా ప్రభుత్వం మూసీ నది సుందరీకరణలో మూసి ఒడ్డున నగర విద్యార్థులకు కావలసిన ఆటస్థలాలు, సామాన్య జనం సేద తీరేందుకు అవసరమైన పార్కులు తగిన స్థాయిలో కేటాయింపు జరపాల్సిన అవసరాన్ని మరువకూడదని సర్కార్ కు ఈ సందర్భంగా రంగయ్య విజ్ఞప్తి చేశారు.