తెలంగాణ

కూల్చుడు.. కూల్చుడే.. దసరా సెలవుల దృష్ట్యా విరామం

కూల్చివేతలతో మూసీ నిర్వాసితులను బెంబెలెత్తించిన అధికారులు ఆ దమనకాండకు కాస్త బ్రేకులేశారు. దసరా సెలవుల దృష్ట్యా ఇండ్ల కూల్చివేతలు, ఇప్పటికే కూల్చేసిన నిర్మాణాల శిథిలాల తరలింపు, రెడ్‌ మార్క్‌ ఇండ్లను కూల్చివేసే ప్రక్రియలన్నింటికీ అధికారులు విరామం ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా సైదాబాద్‌ మండలంలో 72 ఇండ్లకు రెడ్‌ మార్క్‌ వేసిన అధికారులు ఆ ఇంట్లో ఉంటున్న వారికి డబుల్‌ బెడ్‌రూంలు అందిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.ఐనప్పటికీ ప్రభుత్వం మూసీ నివాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో మూసీ వెంట తమ రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇండ్లకు అధికారులు రెడ్‌ మార్క్‌ వేశారు. ప్రస్తుతానికి కూల్చివేతల ప్రక్రియకు విరామం ఇచ్చినా… దసరా తరువాత ఎలాగైనా కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, మూసీ నిర్వాసితులు అదే స్థాయిలో తమ ఇండ్లను కూల్చనివ్వబోమంటూ శపథం చేస్తున్నారు. అయితే రివర్‌ బెడ్‌ కూల్చివేతలే సమస్యగా మారడంతో బఫర్‌ జోన్‌ జోలికొస్తే నిర్వాసితులను ఎదుర్కోవడం కష్టమేనని అధికారులు చర్చించుకుంటున్నారు.

అయితే అందులో చాలా వరకు తమ రెక్కల కష్టంతో నిర్మించిన ఇండ్లను కూల్చొద్దంటూ అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో సైదాబాద్‌ నిర్మాణాలను తొలగించడం అధికారులకు సవాల్‌గా మారింది. మరోవైపు సీఎం రేవంత్‌ రెడ్డి కూల్చివేతలు తప్పవంటూ తన ప్రసంగాల్లో హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రెడ్‌ మార్క్‌ వేసిన ఇండ్లను బలవంతంగానైనా కూల్చేసేలా వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం. దసరా సెలవుల తర్వాత ఈ వ్యూహం అమలు చేయబోతున్నారని తెలిసింది. కాగా, మూసీ నిర్వాసితులు సైతం తమ ఇండ్లను కూల్చనివ్వబోమంటూ శపథం చేస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి పాలన దుర్మార్గంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జిల్లాలో రివర్‌బెడ్‌ నిర్మాణాలు 1595 ఉన్నట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాంపల్లి, బహదూర్‌పురలో ఉన్నట్టు వివరించారు.
కనిపించని పండుగ సందడి..
మూసీ నిర్వాసితులకు బతుకమ్మ సంబురాలు కూడా లేవని పలువురు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హిమాయత్‌నగర్‌లోని మూసానగర్‌, శంకర్‌ నగర్‌లో 150 ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. వారందరినీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు తరలించినట్టు అధికారులు వివరించారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా తమ ఇల్లును కూల్చడానికి అంగీకరించలేదు. అధికారుల భయభ్రాంతుల మధ్య ఇండ్లను బలవంతంగా ఖాళీ చేయాల్సిన దుస్థితి తమదని కొందరు వాపోయారు.ఇప్పుడు ఈ భయం రివర్‌ బెడ్‌ దాటి బఫర్‌ జోన్‌ వరకు విస్తరించింది. ఇటీవల సీఎం బఫర్‌ జోన్‌ నిర్మాణాలను సైతం తొలగించాల్సిందేనని ప్రకటించడంతో అధికారులు ఆ మేరకు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ, దసరా సంబురం.. మూసీ నిర్వాసితుల ప్రాంతాల్లో పెద్దగా కనిపించడం లేదు. తమ గూడు పోతుందనే భయంలోనే వాళ్లంతా ఉన్నారు. మరోవైపు తమ ఇండ్లు కోల్పోయిన ప్రాంతాల్లోనే తమకు ఇండ్లు ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ దొరికే పనిపై ఆధారపడిన తమ బతుకులను వేరే ప్రాంతానికి తరలిస్తే ఎలా బతికేది అంటూ ఆందోళన చెందుతున్నారు.