ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జనసేన మీటింగ్ లో రాపాక…

కోనసీమ రాజకీయాల్లో కొత్త సీన్ కనిపించింది. జనసేన మీటింగ్‌లో రాపాక వరప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. 2024లో వైసీపీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీచేసిన నేత.. జనసేన మీటింగ్‌లో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే రాపాక ప్రత్యక్షం అయ్యారు. మలికిపురంలో జనసేన కార్యక్రమానికి హాజరైన రాపాక.. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిశారు. 2019లో జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లిన రాపాక.. 2024లో అమలాపురం వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల ఆయన కూటమి నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.రాపాక వరప్రసాద్ త్వరలోనే టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఓసారి రాపాక వరప్రసాద్.. దేవ వరప్రసాద్‌ను కలిశారు. దీంతో ఆయన కూటమిలో చేరడం ఖాయమనే చర్చ జరిగింది. తాజాగా.. మళ్లీ జనసేన మీటింగ్‌లోని కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఆయన ఓ ఇష్యూపై తనను కలిశారని జనసేన ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

రాజోలు నియోజకవర్గంలో ఓ కాలేజీ అధ్యాపకులు ఆందోళన చేస్తున్నారని.. ఆ అంశంపైనే చర్చించేందుకు రాపాక వచ్చారని దేవ వరప్రసాద్ స్పష్టం చేశారు. రాపాక వరప్రసాద్ 2019లో జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. అప్పుడు జనసేన క్యాడర్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రాపాక మళ్లీ రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ.. అక్కడ ఓడిపోతారని.. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో.. 2024లో అమలాపురం ఎంపీగా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ సమావేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన జనసేన లేదా టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది.టీడీపీకి మంచి బలం ఉన్న నియోజకవర్గం అయిన రాజోలులో.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీని చూసుకున్నారు.

జనసేన 2019లో గెలిచిన స్థానం కావడంతో టీడీపీ ఆశలు వదులుకుంది. గొల్లపల్లి సూర్యారావు తన కుమార్తెను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇస్తే గెలుపు ఖాయమని కూటమి నేతలకు చెప్పారు.అమూల్య భర్త బిసి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. ఆ వర్గం నుండి మెజారిటీ ఓట్లు తెచ్చుకుంటుదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అయితే గొల్లపల్లి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే.. నియోజకవర్గం టీడీపీకి ఇచ్చినట్లేనని జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవ వరప్రసాద్‌కు టికెట్ లభించింది. ఆయన విజయం సాధించారు.
అవమానం జరిగింది…
కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన… వైసీపీ కోసం ఎంతో కష్టపడినా…రాజోలులో తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. తనను వైసీపీ అవమానించిందని ఆవేదన చెందారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు రాజోలులో టికెట్‌ ఇచ్చారన్నారు. తనకు ఇష్టం లేకపోయినా వైసీపీ పెద్దల సలహాతో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేశానన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలో మరో పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఐదేళ్లపాటు వైసీపీ పెద్దలు చెప్పినట్లు చేసినా 2024 ఎన్నికల్లో తనకు రాజోలు ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని రాపాక ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇష్టలేకపోయినా ఎంపీగా నిలబెట్టారన్నారు. రాజోలు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి ఎంతో కష్టపడ్డానన్నారు. అయినా తనకు కాకుండా గొల్లపల్లి సూర్యారావుకి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారని రాపాక మండిపడ్డారు.

ఈ విషయం తనను ఎంతో కలచివేసినట్లు… తన ప్రాధాన్యత లేని పార్టీలో ఉండదలచుకోలేదన్నారు. అందుకే వైసీపీని వీడుతున్నట్లు రాపాక ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరుతాననే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాపాక తెలిపారు. వైసీపీలో మాత్రం ఉండనని, వేరే పార్టీల నుంచి ఆహ్వానం వస్తే పరిశీలిస్తానన్నారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌… ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. అయితే వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీకి దగ్గరైన రాపాక…అనంతరం పార్టీలో చేరారు. జనసేనపై, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై రాపాక ఎన్నో సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ జగన్ అండతో నియోజకవర్గంలో తనకు తిరుగులేదని భావించిన రాపాక… రాజోలు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. తన కుమారుడి వివాహ కార్డుపై వైఎస్ జగన్, భారతి చిత్రాలు కూడా ముద్రించారు. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది. జనసేన నుంచి గెలిచిన రాపాక… జగన్ కు జై కొట్టడంతో జనసైనికులు అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు.

ఇప్పుడు మళ్లీ రాపాక జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐదేళ్లు వైసీపీకి మద్దతు తెలిపిన రాపాకను గ్లాస్ పార్టీలోకి ఆహ్వానిస్తారో? వద్దంటారో? ఈ విషయంపై జనసైనికులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. మరో వైపు రాపాక టీడీపీ లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి