ఆంధ్రప్రదేశ్

మద్యం షాపుల్లో… మహారాణులు…

మహిళలు.. మహారాణులు.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నదే మహనీయుల లక్ష్యం. అందుకు తగ్గ రీతిలో మహిళలు నేటి కాలంలో అన్ని రంగాలలో రాణిస్తున్నారనే చెప్పవచ్చు. అయితే మద్యం మాట ఎత్తితే చాలు.. చాలా వరకు మహిళలు మా కుటుంబాలు బుగ్గి పాలవుతాయని అంటుంటారు. కానీ ఏపీ కొత్త మద్యం పాలసీ అమలులోకి తెచ్చేందుకు చేపట్టిన లాటరీలో మహిళలకు కూడా జాక్ పాట్ తగిలింది. ఇదొక వ్యాపార మార్గంగా చూస్తే ఆ మహిళలకు అదృష్టం వరించినట్లే.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. నూతన మద్యం పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చింది. అదే రీతిలో నూతన మద్యం విధానం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అంటే ఆయా జిల్లాలలో మొత్తం ఎన్ని వైన్ షాపులు ఏర్పాటు చేస్తారో ప్రకటన జారీ చేసి.. ప్రతి ఒక్క దరఖాస్తుకు రూ. 2 లక్షలు చెల్లించాలని తెలిపి.. దరఖాస్తులను స్వీకరించింది. దీనితో 3396 మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు రాగా.. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక ముందుగా చెప్పినట్లుగా లాటరీ పద్దతి ప్రకారం నేడు షాపుల ఎంపిక ప్రక్రియను కూడా అధికారులు పూర్తి చేశారు.

ఈ లాటరీ పద్దతిపై వైసీపీ నుండి పలు విమర్శలు వస్తుండగా.. వాటికి తావులేకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.కాగా దరఖాస్తు చేసుకున్న వారి ముందు ఒక్కొక్క లాటరీ తీసి.. ఎన్నికల్లో విజేతను ప్రకటించినట్లుగా.. అధికారులు కూడా ఆ షాప్ లాటరీలో ఎవరికి వరించిందో వారి గట్టిగా చెప్పారు. అయితే ఈ రెండు జిల్లాలలో మాత్రం పేర్లు పలికిన వెంటనే అందరూ షాక్ కు గురయ్యారు. దానికి కారణం ఎవరి పేరు తీసినా.. మహిళల పేర్లే. అదృష్టం అంటే వీరిదే.. అదే ఎన్ని దరఖాస్తులు వచ్చినా… అలా ఇలా కలియ తిప్పినా.. అక్కడ మహిళలకే అదృష్టం వరించింది. ఎన్టీఆర్‌ జిల్లాలో కూడా మద్యం షాపుల కోసం లాటరీ నిర్వహించారు అధికారులు. ఇక్కడ జరిగిన లాటరీ పద్దతి ఎంపికలో ఏకంగా 16 మద్యం షాపులను మహిళలు దక్కించుకోవడం విశేషం. అంతేకాదు కృష్ణా జిల్లాలో ఏడు మద్యం షాపులను కూడా మహిళలే దక్కించుకున్నారు. దీనితో ఆ మహిళల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో 16 షాపులు మహిళలకు కైవసం కావడం విశేషం కాగా.. లాటరీలో షాపులు దక్కని వారు సైలెంట్ అయ్యారు.

ఇలా బిజినెస్ రూపంలో ఆలోచించిన మహిళలు.. మద్యం వ్యాపారంలో కూడా ముందడుగు వేయగా.. వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలని కోరుకుందాం అంటున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే ప్రకాశం జిల్లాలో మాత్రం ఓ వైపు లాటరీ పద్దతి సాగుతుండగా.. మరో వైపు మద్యం నూతన పాలసీని రద్దు చేయాలని నిరసన తెలపడం మరో విశేషం. చివరకు నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. చివరగా.. మద్యం షాపు దక్కించుకున్న మహిళలకు.. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం.. తప్పేముంది వ్యాపార మార్గంగా ఆలోచిస్తే చెప్పండి !
లాటరీల్లో పదనిసలు
శ్రీకాకుళం జిల్లాలో లాటరీ సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. అంబేడ్కర్ ఆడిటోరియంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో లక్కీ డ్రా జరుగుతుండగా.. ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు విషయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ దుకాణానికి సంబంధించిన డ్రాలో 9వ నెంబర్ వస్తే దాన్ని అధికారులు పొరపాటున 6వ నెంబర్ అని మైక్‌లో బహిరంగంగా అనౌన్స్ చేశారు. దీంతో 6వ నెంబర్ దరఖాస్తుదారుడు సంబరపడ్డాడు. అయితే, అది 6ను తిప్పితే 9 అవుతుందని.. దాన్ని క్రాస్ చెక్ చేయాలని అధికారులను కోరగా.. అది 9 అని తేలింది. దీంతో మళ్లీ అధికారులు వెంటనే 9వ నెంబర్ అని ప్రకటించారు. దీంతో 6వ నెంబర్ వ్యక్తి తీవ్ర నిరాశకు గురయ్యాడు.ఇదే క్రమంలో అధికారులు కావాలనే నెంబర్ మార్చేశారంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. తోటి దరఖాస్తుదారులు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని.. ఇలాంటి సమయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ మండిపడ్డారు. అనంతరం అధికారులు ఆందోళనకారులకు జరిగింది వివరించి సద్దిచెప్పారు. దీంతో వారు శాంతించగా లాటరీ ప్రక్రియ యథావిధిగా సాగింది.అటు, రాష్ట్రవ్యాప్తంగా లక్కీడ్రా ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.

లాటరీల్లో దుకాణాలు దక్కించుకున్న వారు నగదు సమీకరించుకునే పనిలో పడ్డారు. ఈ లాటరీలో కొందరి పంట పండింది. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి ఏకంగా 5 దుకాణాలను దక్కించుకున్నారు. పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా.. ధర్మవరం మున్సిపాలిటీ దుకాణం 1, 4.. ధర్మవరం రూరల్‌లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నెంబర్ దుకాణాలు ఆయనకు వచ్చాయి. ఒకే వ్యక్తికి ఐదు దుకాణాలు రావడం నిజంగా అదృష్టమేనని అంతా చర్చించుకుంటున్నారు.అటు, రాష్ట్రంలో బుధవారం నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. లాటరీ కేంద్రాలు జన జాతరను తలపించాయి. దరఖాస్తు ఫీజు ద్వారా రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్కువ దుకాణాలు తిరుపతి జిల్లాలో ఉంటే అతి తక్కువ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. తిరుపతి 227 దుకాణాలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు.

అల్లూరి సీతారామారాజు జిల్లాలో 40 మాత్రమే దుకాణాలు ఉన్నాయి. పోటీ ఎక్కువ ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే తక్కువ అనంతపురం జిల్లాలో ఉంది. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 15న ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించనుంది. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో అన్ని బ్రాండ్ల బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు.