పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్ పార్టీ. ఇన్నేళ్లలో అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా చాలా బలపడింది. కానీ, రాను రాను కేసీఆర్ గ్రాఫ్ దిగజారిపోవడం, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో 2023 ఎన్నికల్లో ఓటమిపాలైంది. అధికారంలో ఉన్న రోజుల్లోనే పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది నెంబర్ 2 పొజిషన్. కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ వచ్చిన సందర్భంలో, అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు వర్గీయుల మధ్య కోల్డ్ వార్ నడిచింది. కొన్ని సందర్భాల్లో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు బహిరంగంగానే కేటీఆర్ సీఎం అవుతారని ప్రకటనలు చేశారు. అయితే, హరీష్ రావు మాత్రం ఎప్పుడు ఛాన్స్ వచ్చినా వదలకుండా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. సైలెంట్‌గా క్యాడర్‌లో, జనంలో బలం పెంచుకుంటున్నారు. కానీ, అధికారం కోల్పోయిన దగ్గర నుంచి నెంబర్ 2 వార్ పీక్స్‌కు చేరిందనే అనుమానాలున్నాయి. దీనిపై గ్రామస్థాయిలో జోరుగా చర్చలు జరుగుతున్నాయిజపదేళ్లు సీఎంగా కొనసాగిన కేసీఆర్, మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటమితో సైలెంట్ అయిపోయారు.
ఆరోగ్య కారణాలతో కొన్నాళ్లు ఎవరికీ కనిపించలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొద్ది రోజులు బయటకు వచ్చారు. తర్వాత మళ్లీ మామూలే. ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు. ఆఖరికి అసెంబ్లీలో మౌనముని అవతారం ఎత్తారు. బడ్జెట్ సమావేశాల్లో ఒక్క రోజు మాత్రమే హాజరై, అటు తిరిగి చూసింది లేదు. వరదల సమయంలో జనం అల్లాడిపోతున్నా కేసీఆర్ బయటకొచ్చింది లేదు. సరిగ్గా ఇదే సమయాన్ని బాగా క్యాష్ చేసుకున్నారు హరీష్ రావు. పార్టీ అధినేత సైలెంట్‌గా ఉండడంతో కేటీఆర్ కంటే ముందే అన్ని విషయాల్లో రియాక్ట్ అవుతూ, ప్రతిపక్ష నేత పాత్ర పోషించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ కేటీఆర్ కన్నా హరీష్ రావు దూకుడుగా వ్యవహరించారు. పార్టీ నేతలను వెంటబెట్టుకుని ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారు. బాధితులను పరామర్శించారు. తానున్నాననే భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, నిత్యావసర సరుకులను సిద్దిపేట నుంచి లారీలలో తరలించారు. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూ ముందుకు సాగారు.
ఇక్కడే కేటీఆర్ కన్నా హరీష్ రావుకు ఎక్కువ మార్కులు పడ్డాయి. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారం తెరపైకి వచ్చింది. కౌశిక్ రెడ్డి వెనుక ఉండి అంతా నడిపించారు హరీష్ రావు. ఎమ్మెల్యేతో కలిసి ధర్నా కూడా చేశారు. క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు.బీఆర్ఎస్ హయాంలో ఎంతో ఆర్భాటంగా మూసీ ప్రక్షాళన ప్రకటించారు కేసీఆర్. కానీ, జరిగింది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే ప్రాజెక్టును చేపట్టి, పనులు వేగంగా జరిగేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తోంది. అయితే, దీని చుట్టూ కూడా హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ అనేలా కోల్డ్ వార్ కొనసాగుతోంది. నిర్వాసితుల పలకరింపులోనూ ఇద్దరు నేతలు పోటీపడి మరీ వెళ్లారు. ఎప్పటిలాగా ముందుగానే రియాక్ట్ అయిన హరీష్ రావు, బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. అయితే, కేటీఆర్ తానేమన్నా తక్కువా అన్నట్టు ఒకటికి రెండు సార్లు పర్యటనలు చేసి హీట్ పెంచారు. ఇలా ఒకటా రెండా, చాలా విషయాల్లో హరీష్ రావు, కేటీఆర్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. మొన్న మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో కేటీఆర్, హరీష్ వెళ్లారు.
కానీ, కలిసి కనిపించింది లేదు. వేర్వేరుగా వెళ్లి బొకేలు ఇచ్చి వచ్చేశారు. ఇవన్నీ గమనిస్తున్న కిందిస్థాయి క్యాడర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది.బీఆర్ఎస్ రెండోసారి గెలిచి అధికారం చేపట్టాక హరీష్ రావును దూరం పెట్టారు కేసీఆర్. దీనిపై అనేక చర్చలు జరిగాయి. నెంబర్ 2 పొజిషన్ కేటీఆర్‌కు ఫిక్స్ చేయాలనే లక్ష్యంతోనే హరీష్‌కు కేసీఆర్ పదవి ఇవ్వలేదని అంతా అనుకున్నారు. అయితే, తమ నాయకుడికి పదవి రాలేదని అనుచరులు కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. ఇదంతా హరీష్ కనుసన్నల్లోనే జరుగుతోందన్న కబురు కేసీఆర్‌కు చేరింది. అంతకుముందు పాస్ పోర్టు కేసులో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిని బూచిగా చూపిస్తూ హరీష్ రావును కూడా బెదిరించారనే ప్రచారం సాగింది. గతంలో హరీష్ రావు భార్య, కూతురు పేర్ల మీద దొంగ పాస్ పోర్టులతో గుజరాత్ మహిళలను అమెరికా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. కేసీఆర్ అంత యాక్టివ్‌గా లేరు.
ఈ నేపథ్యంలో హరీష్ రావు దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు గ్రామస్థాయిలో చర్చ జరుగుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ వారి మాటల్లో వినిపిస్తోంది. త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తారని అంటున్నారు. మరి, ఆయనొస్తే ఏమైనా మార్పు ఉంటుందేమో అనే ఆశలో ఉన్నారు. అయితే, అప్పుడు కేసీఆర్ పవర్‌లో ఉన్నారని సైలెంట్ అయిన హరీష్ రావు, ఇప్పుడు చెప్పిన మాట వినకపోవచ్చు కానీ, పాత కేసు సీబీసీఐడీ చేతిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెడితే పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది.