శారదాపీఠం.. పేరుకే పీఠం కానీ వివాదాల పుట్ట అనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పీఠం చెప్పేదొకటి, తీరా చేసేది ఇంకొకటి. ఒక్కో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కో రకంగా ఉంటూ వత్తాసు పలకడం, సర్కారు కేటాయించిన భూములను వాణిజ్యపరంగా వాడుకోవడం పరిపాటిగా వస్తోంది. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిందే తడవుగా, అది ఏదైనా సరే ఇష్టానుసారం ఇచ్చేశారని ఆరోపణలు కోకొల్లలు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత శారదాపీఠానికి వరుస షాక్‌లు ఇస్తోంది. అటు విశాఖపట్నంలో, ఇటు తిరుమలలో కేటాయించిన భూములును రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకున్నది. వివాదాస్పద పీఠాధిపతి స్వరూపా నందేంద్రకు చెందిన శారదాపీఠానికి ఈ మధ్య అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఇచ్చిన భూములన్నింటినీ తిరిగి తీసుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. స్వాధీనం చేసుకున్న ఆ భూములను ప్రజా ప్రయోజనాల కోసం వాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో భీమిలి మండలం కొత్తవలసలో ఎకరం లక్ష రూపాయిల చొప్పున 15 ఎకరాలు కేటాయించింది.
అయితే మార్కెట్‌లో ఎకరం రూ. 15 కోట్ల వరకూ ఉంది. అంటే రూ. 225 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ. 15 లక్షలకే ధారాదత్తం చేసింది. పీఠానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం భూములను వాడుకోవాలన్న దురుద్దేశాన్ని నేటి ప్రభుత్వం గ్రహించింది. వివాదానికి దారి తీసిన ఈ కేటాయింపులను రద్దు చేయాలని ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయించింది.తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్ద కూడా పీఠానికి 5వేల చదరపు అడుగుల భూములను 30 ఏళ్ల పాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అయితే దీన్ని అడ్డంపెట్టుకుని భారీగా అక్రమ నిర్మాణాలు సాగించింది. ఇదంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2005 ఫిబ్రవరి జరిగిన కథ. అప్పట్లో దేవస్థానం భూములను ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మరింత రెచ్చిపోయిన మరిన్ని అక్రమాలకు తెరలేపింది పీఠం. అదనపు నిర్మాణాలకు టీటీడీ నుంచి అనుమతి పొంది మరీ నిర్మాణాలు చేపట్టింది. ఇలా మొత్తంగా 1851.06 చ.మీ. మేర నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు టీటీడీ అధికారులు తేల్చారు.
నిబంధనలు అతిక్రమించినా సరే శారదాపీఠం నుంచి కేవలం వివరణ మాత్రం తీసుకొని సైలెంట్ అయ్యింది ప్రభుత్వం. దీనికి తోడు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పీఠం పనిచేస్తోందని, ఆ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ 2023లో టీటీడీ తీర్మానం చేసి మరీ ప్రభుత్వానికి పంపింది. నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ అక్రమాలు కొనసాగుతూనే వచ్చాయి. ఈ విషయాలన్నీ గమనించిన ప్రభుత్వం శారదాపీఠం అక్రమాలపై దృష్టి సారించింది.తిరుమలలో విశాఖ శారదా పీఠం నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారని, ఈ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీనీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. అంతేకాదు భవిష్యత్‌లో ఈ తరహా భూ కేటాయింపులు, భవనాల నిర్మాణానికి సంబంధించిన అంశాల తీర్మానాల కంటే ముందుగా ప్రభుత్వ పరిశీలనకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఈ అక్రమ నిర్మాణాలు ఏమవుతాయి? కూల్చివేతలు ఉంటాయా? లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
అటు భిమిలిలో కేటాయించిన భూములను ప్రభుత్వం ఏం చేయబోతోందనే దానిపై కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. జనసేన నేత కిరణ్ రాయల్ తిరుమలలోని పీఠం భూములు, నిర్మాణాలను పరిశీలించారు. తిరుమలలో ప్రతి గజం ఆ శ్రీవారిదేనని, స్వామీజీలు, బాబాజీలు దోచుకుంటాం అంటే కుదరదని ఆయన హెచ్చరించారు. భక్తి పేరిట తిరుమల, వైజాగ్‌లో కోట్ల రూపాయిలు విలువ చేసే భూములను కాజేశారని ఆరోపించారు. ఈ నిర్మాణాలను కూల్చేస్తే రానున్న రోజుల్లో మరొకరు ఇలాంటి కట్టడాలు చేయాలంటే భయం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణాల వ్యవహారం కోర్టుల పరిధిలో ఉండటంతో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని కచ్చితంగా కూల్చివేతలు ఉంటాయని కూటమి నేతలు చెబుతున్నారు.