తెలంగాణలో న్యాయవిచారణలు కీలక దశకు చేరుకుటున్నాయి. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌కు కీలకమైన ఆధారాలు లభించాయని అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నల్లా వెంకటేశ్వర్లు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను న్యాయ విచారణ కమిషన్ చైర్మెన్ జస్టిస్ పీసీ ఘోష్‌కు అందజేశారు. గతంలోనూ ఆయనను కమిషన్ పిలిచి ప్రశ్నించింది. ఇప్పుడు ఆయన ఒక్కటి కూడా దాచుకోకుండా పూర్తి వివరాలు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్‌దేనని ఇప్పటి వరకూ విచారణకు హాజరైన అధికారులు చెబుతూ వచ్చారు. నిర్ణయాలు, అధికారిక వ్యవహారాలు, ప్లానింగ్, డిజైనింగ్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అన్ని వివరాలనూ విచారణ కమిషన్ సేకరించింది. డీపీఆర్ అంశాలు కూడా కమిషన్‌కు చేరాయని భావిస్తున్నారు. డీపీఆర్‌ను అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదించారని అధికారులు స్ప,్టం చేశారు.
కాళేశ్వరం డిజైన్లనూ ఫైనల్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఇందుకు సంబంధించి పలు సమావేశాలు, మినిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు, మూడు బ్యారేజీల వివరాలను కమిషన్‌కు చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది. విచారణ కమిషన్‌కు చేరిన ఫైళ్లలో ఉన్నతాధికారులు, కాళేశ్వరం బాధ్యతలు చూసిన సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, ఏఈలు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయనీ, అందులో బ్లాకులు కుంగడానికి, సీపేజీలు రావడానికి పిల్లర్ల కింద ఇసుక కదిలిపోవడమే కారణమని ఇప్పటికే నివేదికలు ఇచ్చారు. పీసీ ఘోష్ కమిషన్ అధికారుల స్థాయిలో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు. దీంతో అధికారులు ఒక్కటి కూడా దాచడానికి అవకాశం లేకుండా పోతోంది. ఆ ప్రాజెక్టు వ్యవహారంలో జరిగింది మొత్తం విచారణ కమిషన్‌కు వెల్లడించారని చెబుతున్నారు. అధికారుల స్థాయిలో విచారణ దాదాపుగా పూర్తి కావడంతో తదుపరి విచారణకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను పిలిచే అవకాశం ఉందని జలసౌధలో ప్రచారం జరుగుతోంది.
అధికారుల వాంగ్మూలాలు అన్ని మాజీ సీఎం కేసీఆర్, మాజీ సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావును బుక్ చేసేలా ఉన్నాయి. ప్రాజెక్టు వైఫల్యానికి కారకులను తేల్చే క్రమంలో ఎవరినైనా పిలుస్తామనీ, విచారణకు రాకపోతే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుం టామని గతంలో జస్టిస్ ఘోష్ చెబుతున్నారు. ఎన్డీఎస్‌ఏ, పోలీస్ విజిలెన్స్ నివేదికల ఆధారంగా కమిషన్ విచారణ చేస్తారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తే ఈ కేసు సంచలనం అవుతుంది.