ఎన్నికల హామీల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాధాన్యత క్రమంలో కీలక హామీలు అమలు చేసే పనిలో పడింది. అందులో భాగంగా అధికారంలోకి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి ఫైల్ పై సంతకం చేశారు.ఇప్పుడు డీఎస్సీ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.తాజాగా పోస్టుల భర్తీ పై కీలక ప్రకటన చేశారు. టెట్ కీ విడుదల చేసిన ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు చేసింది.డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కోసం ముహూర్తాన్ని సైతం నిర్ణయించింది. నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేయాలని డిసైడ్ అయింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పోస్టుల రోస్టర్ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నవంబరు రెండున ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత డీఎస్సీ ప్రకటిస్తే కొత్తవారు సైతం దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. కనీసం మూడు నుంచి నాలుగు వారాల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్త ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేసవి నాటికి కొత్త టీచర్లకు శిక్షణ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారిని నియమించేలా ప్లాన్ చేస్తోంది. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలతో పాటు ఏకోపాధ్యాయ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల పాఠశాలలు ఓకే టీచర్ తో నడుస్తున్నాయి. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది.అయితే ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ కొత్తగా టెట్ రాసేవారికి అవకాశం కల్పించాలని అభ్యర్థుల నుంచి విన్నపం వచ్చింది.
దీంతో డీఎస్సీ నిర్వహణ మూడు నెలల పాటు వాయిదా పడింది. ఇటీవల టెట్ ముగియడంతో ఇప్పుడు డీఎస్సీకి అంతా సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించి తుది కీ విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం.. తుది కీ విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల 68 వేల 661 మంది టెట్ రాశారు. అందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ పరీక్ష రాయనున్నారు.