సమగ్ర కుటుంబ సర్వేపై పార్టీ కార్యకర్తల్లో అవగాహన కల్పించి గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల వారీగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలకు ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మూడు రోజుల కిందట నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేమలు వీరేశం నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ హాజరయ్యారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజర్ అయ్యారు. సమగ్ర కుటుంబ సర్వే, కుల గణనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలన్న అంశాలపై ముఖ్య కార్యకర్తల కోసం నిర్వహించిన సమావేశంలో కేడర్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై, హామీల విస్మరణపై భగ్గు మంది.
ఎమ్మెల్యేలను నిలదీస్తూ ముఖ్య కార్యకర్తలు మాట్లాడిన వీడియో ఓకటి మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఈ వీడియోను వైరల్ చేస్తోంది.పార్టీ పరిస్థితిపై మాట్లాడేందుకు అవకాశం వచ్చిన జిల్లా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రభుత్వ పాలనపై విరుచుకు పడింది. నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచర నాయకుడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుమ్మల మోహన్ రెడ్డి ముందుగా ఈ అంశాలను లేవనెత్తారు. ఆయనను మరికొందరు నాయకులు కూడా అనుసరించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పది నెలల పాలనా కాలం ముగిసినా అమలు చేయకపోవడాన్ని నిరసించారు. పెన్షన్లు ఎందుకు పెంచలేదు..? గ్యాస్ డబ్బులు ఎందుకు రావడం లేదు..? ఉచిత కరెంటు ఇంకా అందరికి అందడం లేదు. ఆరు గ్యారంటీలేమయ్యాయి..? అంటూ వారు ఎమ్మెల్యేలను నిలదీశారు.
‘‘ కేడర్ అంతా ఊరూరూ.. పల్లె పల్లెకు తిరిగి పనిచేస్తేనే మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ, పార్టీ ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదు. ఊళ్లలో ప్రజల ముందు తలెత్తుకోలేక పోతున్నాం..’’ అంటూ ముఖ్య కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది.జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ వరి ధాన్యం దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల్లో ఇరవై రోజులుగా రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఎందుకు త్వర త్వరగా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం లేదంటూ రైతులు వేస్తున్న ప్రశ్నలకు సమాధం చెప్పలేక పోతున్నామని వాపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే పౌరసరఫరాల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా లాభం లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు.సన్నాలకు ఇస్తామన్న రూ.500 బోనస్ సంగతి కూడా మర్చిపోయారని, నిత్యం భారీగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని కళ్లాల్లో ధాన్యం తడిచిపోయిన రైతులను చూస్తుంటే వారిని ఎలా సమాధాన పరచాలో తెలియడం లేదని .. ఈ అంశాలన్నింటినీ ఎమ్మెల్యేలు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం విశేషం.వచ్చే ఏడాది (2025) సాంతం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
తొలుత గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రభుత్వంపై గ్రామీణ ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతోందని, ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో తిరిగి ఓట్లు వేయించాలేమని కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల ఎదుట కుండబద్దలు కొట్టారు.మొత్తంగా ఈ మీటింగ్ సారాంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాలన సజావుగా సాగడం లేదన్న ఆవేదన కార్యకర్తల్లో గూడు కట్టుకుని ఉందన్న విషయం స్పష్టమైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకే వేదిక మీద ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కేడర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ద్రుష్టికి ఈ అంశాన్ని తీసుకువెళతారా..? కార్యకర్తల్లో పెరిగిపోతున్న ఈ అసంతృప్తికి బ్రేక్ వేసి కొత్త ఉత్సాహంతో ప్రజల్లోకి పంపుతారా లేదా వేచి చూడాల్సి ఉంది.అదే మాదిరిగా, ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని ఎలా కంట్రోల్ చేస్తారు..? 6 గ్యారంటీ హామీలను పూర్తి స్థాయిలో ఎపుడు అమలు చేస్తారు అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.