ఓ వైపు పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగిడారు అని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలకు మన అభివృద్ధి కనిపిస్తుంటే.. మన పక్కనే ఉన్న నేతలకు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. బాండ్ పేపర్లు రాసిచ్చి గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు.
ఈ ఏడాదికి మన పార్టీకి 20 ఏండ్లు నిండాయి. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 20 ఏండ్లు నిలదొక్కుకుని రెండు సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఆషామాషీ కాదు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రజలకు తెలిపేందుకు ఈనెల 29న విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ సభకు గులాబీ దండు కదిలితే ప్రతిపక్షాల గుండె అదరాలి అని కేటీఆర్ అన్నారు.
1971లో 14 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 11 మంది తెలంగాణ ప్రజా సమితి పార్టీ నుండి గెలిచారు. కానీ విధిలేక కాంగ్రెస్‌లో కలిసిపోవాల్సి వచ్చింది. జయశంకర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం కొనసాగేలా చూశారు. 2001లో ఉద్యమ బిడ్డగా కేసీఆర్ వచ్చారు. తెలంగాణ అనే నేతల మీద ప్రజల్లో అనుమానం ఉండేది. ఒక్కడిగా ఆనాడు కేసీఆర్ తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు అని పేర్కొన్నారు. మొట్టమొదటి పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏకగ్రీవ తీర్పు ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే ఇచ్చింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
బీజేపీ నేతల వద్ద సమాధానం లేదు
వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదు అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు బండి సంజయ్ తన పాదయాత్రలో బ్రాండ్ అంబాసిడర్ లాగా కనిపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు ఇస్తున్నారా? గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారా? హరితహారం వంటి పథకాలు ఉన్నాయా? అని కేటీఆర్ నిలదీశారు. మన రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. రైతుల కోసం కేసీఆర్ చేసిన పనులు ఎవ్వరూ చెయ్యలేదు. పంట పెట్టుబడి, విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వంటివి కేసీఆర్ మాత్రమే చేశారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.