జాతీయం ముఖ్యాంశాలు

Vaccine Mixing: కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ మిక్సింగ్‌తో అద్భుత‌మైన ఫ‌లితాలు: ఐసీఎంఆర్‌

క‌రోనాపై యుద్ధంలో భాగంగా వ్యాక్సిన్లు వేయ‌డ‌మే కాదు.. రెండు ర‌కాల వ్యాక్సిన్లను మిక్స్ చేయ‌డం కూడా చాలా దేశాలు చేస్తున్నాయి. ఇండియాలోనూ ప్ర‌ధానంగా అందుబాటులో ఉన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల మిక్సింగ్ ( Vaccine Mixing )పై కూడా ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాతాయి. తాజాగా ఐసీఎంఆర్‌, పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ క‌లిసి నిర్వ‌హించిన అధ్య‌య‌నం కూడా ఈ వ్యాక్సిన్ మిక్సింగ్ అద్భుతంగా ప‌ని చేస్తున్న‌ట్లు తేల్చింది.

ఏంటీ వ్యాక్సిన్ మిక్సింగ్‌?

ఈ అధ్య‌య‌నంలో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సిద్ధార్థ్ న‌గ‌ర్‌లో 18 మంది వ్య‌క్తుల‌లో రోగ‌నిరోధ‌క‌త‌ను ప‌రిశీలించారు. వీళ్లు ఒకే ర‌క‌మైన వ్యాక్సిన్ రెండు డోసులుగా కాకుండా.. కొవిషీల్డ్ ఒక డోసు, కొవాగ్జిన్ మ‌రో డోసుగా తీసుకున్న వాళ్లు. ఇలా రెండు వ్యాక్సిన్ల‌ను రెండు డోసులుగా తీసుకున్న వాళ్ల‌లో రోగ‌నిరోధ‌క‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఐసీఎంఆర్ త‌న అధ్య‌య‌నంలో గుర్తించింది. ఒకే ర‌క‌మైన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్ల‌లో కంటే ఇలా రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ల‌లో ఫ‌లితాలు మ‌రింత మెరుగ్గా ఉన్న‌ట్లు తేలింది.

పొర‌పాటున మిక్స్ చేసి..

నిజానికి ఈ 18 మందికి ప్ర‌యోగాల్లో భాగంగా రెండు వ్యాక్సిన్లు ఇవ్వ‌లేదు. ఈ ఏడాది మే నెల‌లో యూపీలోని సిద్ధార్థ్ న‌గ‌ర్‌లో కొవిషీల్డ్‌ను తొలిడోసుగా తీసుకున్న‌ 18 మందికి పొర‌పాటున ఆరోగ్య సిబ్బంది కొవాగ్జిన్‌ను రెండో డోసుగా ఇచ్చారు. దీంతో పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ వీళ్ల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించింది. కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్న వాళ్ల‌లోని రోగ‌నిరోధ‌క శ‌క్తి, ఆ వ్యాక్సిన్లు ఇచ్చే ర‌క్ష‌ణ‌ను వీళ్ల‌తో పోల్చి చూసింది. ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర ఫలితాలు వ‌చ్చాయి.

రెండు వ్యాక్సిన్లు మిక్స్ అయిన వాళ్ల‌లో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్ల‌ను త‌ట్టుకునే శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని ఈ ఇన్‌స్టిట్యూట్ అధ్య‌యనంలో తేలింది. ఇలాంటి వాళ్ల‌లో యాంటీబాడీల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించారు. వెక్టార్ ప్లాట్‌ఫామ్‌పై ఎడినోవైర‌స్ ఉప‌యోగించిన అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ను, క్రియార‌హితం చేసిన వైర‌స్ ఉప‌యోగించి చేసిన కొవాగ్జిన్ మిక్సింగ్ మంచి ఫ‌లితాలు ఇచ్చిన‌ట్లు ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది.