అవి భారీ షిప్పింగ్ కంటైనర్లు. ఇప్పుడవి సరుకుల రవాణా వదిలేసి ఢిల్లీలోని ఎర్రకోట ముందు పెద్ద పెద్ద గోడల్లాగా కనిపిస్తున్నాయి. వీటిని అక్కడ ఉంచింది పోలీసులే కావడం గమనార్హం. పంద్రాగస్ట్ వేడుకలకు సమయం దగ్గరపడుతుండటంతో ఢిల్లీ పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు. కారణం రైతుల ఆందోళన. ఈ ఏడాది రిపబ్లిక్ డేనాడు జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఈసారి ఈ ఏర్పాట్లు చేయడం విశేషం. భద్రతా కారణాల వల్లే వాటిని అక్కడ ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కంటైనర్లకు పెయింట్లు వేసి, మంచిగా ముస్తాబు చేయనున్నట్లూ చెప్పారు. అంటే రైతుల ఆందోళన నుంచి రక్షణతోపాటు డెకరేషన్‌కు కూడా ఇవి పనికి వస్తున్నాయి. మరోవైపు ఈమధ్య జరుగుతున్న డ్రోన్ల దాడులను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. స్వతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్న విషయం తెలిసిందే.