ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మరాఠ ప్రచారానికి పవన్ కళ్యాణ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు జాతీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రులను రంగంలోకి దించాలని ఆలోచన చేస్తోంది బీజేపీ. దీంతో కొంతైనా గట్టెక్కవచ్చని ఆలోచన చేస్తోంది బీజేపీ.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువు ఉండరు. ఎప్పుడు.. ఎవరు.. ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీల చూపంతా మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పడ్డాయి.శివసేన, ఎన్సీపీని చీల్చిన బీజేపీ, కొన్నాళ్లు మహారాష్ట్రను తెర వెనుక నుంచి రూలింగ్ చేసింది. ఈ విషయాన్ని రాజకీయ నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు. ఈ పీఠాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నారు కమలనాథులు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేంద్ర మంత్రి అమిత్ షా దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించే ప్రధాన చర్చ జరిగిందని ఢిల్లీ పొలిటికల్ సమాచారం.మహారాష్ట్రలో తెలుగు ప్రజలు దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపుతారట.

ఈ క్రమంలో కూటమి నేతలు ప్రచారం చేస్తే బాగుంటుందని అమిత్ షా సూచన చేశారట. అందుకు పవన్ సానుకూలం గా  స్పందించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు టీడీపీ నేతలు ఎవరైనా హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి స్టార్ క్యాంపెయినర్‌ సీఎం రేవంత్‌రెడ్డి రేపో మాపో ప్రచారంలోకి దిగబోతున్నారు.ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో రోడ్ షో, సభలకు హాజరుకావచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్‌ అన్నట్లుగా ప్రచారం సాగవచ్చని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.