ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేతల దాడి కేసులో.. వారికి ‘సెక్షన్‌–41ఏ’ నోటీసులివ్వండి

పోలీసులకు హైకోర్టు ఆదేశం 

టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసులో ముందు వారికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు గురువారం తాడేపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఉత్తర్వులిచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇతర నేతలు, కార్యకర్తలు ఈ నెల 17న కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద శాంతియుతంగా ధర్నాకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు, వారు తీసుకొచ్చిన కిరాయి రౌడీలు ఎమ్మెల్యే తదితరులపై దాడిచేశారు.  దీనిపై జోగి రమేష్‌ డ్రైవర్‌ తాండ్ర రాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, అధికార ప్రతినిధి పట్టాభితో పాటు ఇతర నేతలు నాగుల్‌మీరా, సుంకర విష్ణుకుమార్, జంగాల సాంబశివరావు తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.