తెలంగాణ ముఖ్యాంశాలు

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగంగా దివ్యాంగులకు మంత్రి కేటీఆర్‌ బైక్‌లు అందజేత

గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. నగరంలోని జలవిహార్‌లో ఆదివారం ఉదయం గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు బైక్‌లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తుంటామన్నారు. ఒక్కోసారి అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందన్నారు. బ్యానర్లు, హోర్డింగులు పెట్టి ఖర్చు చేస్తాం. దాన్ని తగ్గించుకోవాలన్నదే తన ఆలోచన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వృథా ఖర్చులు పెట్టొద్దని గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా 100 అంబులెన్స్‌లు పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఈ యేడాది పుట్టినరోజును పురస్కరించుకుని వెయ్యి మోటార్‌ సైకిళ్లను దివ్యాంగులకు అందించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం స్వతహాగా ముందుకు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నారన్నారు. త్రిచక్ర వాహనం దివ్యాంగుల జీవనోపాధికి ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు.