- పోతిరెడ్డిపాడు నుంచి జలాల అక్రమ తరలింపు
- రెండేండ్లలోనే 308 టీఎంసీలు బేసిన్ అవతలికి..
- ఈ ఏడాది ఇప్పటికే 25 టీఎంసీలు మళ్లించిన ఏపీ
- సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ అవసరాలకు కష్టం
- కేంద్ర జల్‌శక్తి శాఖ, కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖలు
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఏపీ సర్కారు ఏటా బేసిన్ అవతలి ప్రాంతాలకు అక్రమంగా కృష్ణా జలాలను తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. దీనిని వెంటనే అడ్డుకోవాలని డిమాండ్‌చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ) తెలంగాణ సాగునీరు, ఆయకట్టు అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ శనివారం లేఖలు రాశారు. శ్రీశైలం కుడి బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ) కు కేంద్ర ప్లానింగ్ కమిషన్ 19 టీఎంసీలు కేటాయిస్తే అందులో 11 టీఎంసీలు పునరుత్పాదక జలాలు మాత్రమేనని తెలిపారు. 8 టీఎంసీలు మాత్రమే కేసీ కెనాల్ ఆధునీకరణ ద్వారా మిగులుతున్నాయని పేర్కొన్నారు. చెన్నై తాగునీటి అవసరాల కోసం మూడు రాష్ట్రాలు కలిపి 15 టీఎంసీలు అందించాల్సి ఉండగా.. అందులో రెండు తెలుగు రాష్ర్టాలు 2.5 టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. వీటిని కూడా జూలై- అక్టోబర్ మధ్యలోనే తరలించాలి. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని నాగార్జునసాగర్ ఆయకట్టు కోసం 280 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 16.5 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచే విడుదల చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కానీ, ఏపీ సర్కారు ఏటా కేటాయింపులకు మించి జలాలను కృష్ణా బేసిన్ అవతలికి తరలిస్తున్నదని మండిపడ్డారు. ఫలితంగా సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరని పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేండ్లలోనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి ఏపీ 308 టీఎంసీలను తరలించిందని లెక్కలతో సహా వివరించారు. ఈ ఏడాది ఇప్పటికే 25 టీఎంసీలను బేసిన్ అవతలికి మళ్లించిందని తెలిపారు.
విద్యుదుత్పత్తి తెలంగాణకు అత్యవసరం
శ్రీశైలం రిజర్వాయర్ విద్యుదుత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు మాత్రమేనని రజత్‌కుమార్ పునరుద్ఘాటించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు కలుపుకుని 405 టీఎంసీల భారీ సామర్థ్యంతో చేపట్టారని వివరించారు. ఇందుకుసరిపడా నీటిని నిల్వ చేసుకొనేందుకు వీలుగా శ్రీశైలం రిజర్వాయర్‌ను నిర్మించారని వెల్లడించారు. అక్కడి నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 280 టీఎంసీలను సాగర్‌కు విడుదల చేయాల్సి ఉన్నదని స్పష్టంచేశారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఆయకట్టుకు సాగునీటినందించాలంటే ఎత్తిపోతల ద్వారానే వీలవుతుందని.. అందుకు విద్యుత్తు అత్యవసరమని రజత్‌కుమార్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామంటూ తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం, వెంటనే ఉత్పత్తిని నిలిపివేయాలంటూ కేఆర్‌ఎంబీ ఆదేశించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.