ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రాజమండ్రి-అనకపాల్లి, రాయచోటి-కడప జాతీయ రహదారుల విస్తరణకు పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.రాజమహేంద్రవరం-అనకాపల్లి, రాయచోటి-కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీజేపీ ఎంపీ డా.సీఎం రమేష్ తెలిపారు. జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరువరసల రహదారిగా విస్తరించనున్నారు. అలాగే జాతీయ రహదారి 40లోని రాయచోటి-కడప రహదారిలో నాలుగు వరసలుగా టన్నెల్ తో రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదించారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.జాతీయ రహదారి 16 పరిధిలోని అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు 741.255 కి.మీ నుంచి 903 కి.మీ సెక్షన్లో నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరణకు డీపీఆర్ కన్సల్టెంట్ కు అందజేశారని, అదేవిధంగా జతీయ రహదారి 40లో రాయచోటి-కడప 211/500 కి.మీ నుంచి 217/200 కి.మీ సెక్షన్లో నాలుగు వరుసల రహదారి టన్నెల్ నిర్మాణం ఈ ఏడాది వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు కేంద్రం తెలిపిందని సీఎం రమేష్ అన్నారు.
టన్నెల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరం ఉన్నందున, అటవీ శాఖ నుంచి అలైన్మెంట్ అనుమతులు వచ్చిన తరువాత టన్నెల్ తో పాటు నాలుగు వరుసల రహదారి నిర్మాణ ప్రతిపాదనలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారని ఎంపీ సీఎం రమేష్ తెలియజేశారు.విశాఖ మెట్రో సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు,పీజీవీఆర్ నాయుడు,వెలగపూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. 2014 విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ఐటం 12 ప్రకారం విజయవాడ,విశాఖకు మెట్రో రైలుపై సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని పొందుపరిచారు.దీని ప్రకారం 2014లో డీపీఆర్ సిద్దం చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు నాటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని 2015లోనే డీఎంఆర్సీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించిందని నారాయణ పేర్కొన్నారు.
విశాఖపట్నంకు సంబంధించి 42.5 కిమీల నెట్ వర్క్ తో మూడు కారిడార్లతో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చారని 2019 ఏప్రిల్ లో టెండర్లు పిలవగా కొన్ని కంపెనీలు బిడ్లు కూడా దాఖలు చేసాయన్నారు.అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసి ఉంటే విశాఖపట్నంతో పాటు విజయవాడకు మెట్రో రైలు వచ్చి ఉండేదని, విశాఖపట్నంలో భోగాపురం వరకూ పొడిగింపు సాకుతో ప్రాజెక్ట్ ను పెండింగ్ లో పెట్టేసారని మంత్రి నారాయణ తెలిపారు.