మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేసి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో ఇప్పుడు కూడా అదే ఒంటెద్దు పోకడ పోతూ సొంత పార్టీ వారి నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా తన పార్టీ అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తుందని ప్రకటించి వైసీపీ ఎమ్మెల్యేలను ఉలిక్కిపడేలా చేశారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే అవకాశాన్ని మూర్ఖత్వంతో దూరం చేసుకుంటున్నారని సొంత చెల్లెలు షర్మిలకు టార్గెట్ అవుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. ఘోర పరాజయం తర్వాత కూడా సొంత పార్టీ వారికి కనీస వాల్యూ ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వైసీపీలోనే వినపడుతున్నాయి.
జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఆయనకు పార్టీ విషయాలను, నిర్ణయాలను నేతలతో పంచుకునే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తుంది. ఏ పార్టీలోనైనా అధ్యక్షుడు పార్టీ సీనియర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వైసీపీలో ఆ పరిస్థితి కనిపించదు.జగన్ అనుకున్నది అనుకున్నట్లే జరగాలి. తాజాగా ఆయన తీసుకున్న రెండు నిర్ణయాలు మరోసారి ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అదే వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్ధులను కూడా ప్రకటించిన జగన్ ఇటీవల ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సొంత పార్టీ వారికి షాక్ ఇచ్చారు . ఇక ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభకు వెళ్లేది లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అంతవరకూ తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని తేల్చి చెపుతున్నారు.ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా.. జగన్ వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారంట. మనమేమీ సభకు శాశ్వతంగా వెళ్లం అనడం లేదు.
ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళతాం. 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా? అలా గుర్తించకుండా సభకు వెళితే మామూలు ఎమ్మెల్యేకిచ్చినట్లు రెండు నిమిషాలు మైక్ ఇస్తామంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం ప్రస్తావించగలనని వితండ వాదం చేశారంట.అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాం. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదని జగన్ అన్నట్లు తెలిసింది. అయితే సభకు ఒకసారి వెళ్లి చూస్తే మేలని, వెళ్లాక కూడా మైక్ ఇవ్వకపోతే అప్పుడే అసెంబ్లీకి రామంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారంట. దానికి వాళ్లు మైక్ ఇవ్వరు. అంతదానికి వెళ్లడమెందుకని జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీకి వెళ్లనంటున్న జగన్ మీడియాముఖంగా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలను మాట్లాడతానంటున్నారు. జగన్ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం నెలకొందంటున్నారు. జగన్ తన నిర్ణయంతో అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఆయన చెపుతున్నట్లు సభలో విపక్ష ఎమ్మెల్యేలుగా ఉంది వైసీపీ వారే. అధికార కూటమి ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఇంకే పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. అంటే ప్రశ్నించే అవకాశం ఒక వైసీపీకే ఉంది. అలాంటిది జగన్ బాయ్‌కాట్ మంత్రం పఠిస్తుండటంపై సొంత చెల్లి సహా అందరూ ధ్వజమెత్తుతున్నారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని షర్మిల విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుకయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటని యద్దేవా చేశారు. ప్రజాతీర్పు గౌరవించని వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.బాయ్‌కాట్ నిర్ణయంపై అటు సొంత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా.. ఇతర పక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ పట్టించుకునే పరిస్థితి కనపడదు. అయితే ఆయన ఇక్కడ చిన్నలాజిక్ మిస్ అవుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసలు ఈ టర్మ్‌లో అసెంబ్లీకే రామని ఆయన ప్రకటించారు. నిర్ధిష్ట గడువులోగా ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి హాజరు కాకపోతే చర్యలు తీసుకునే విచక్షణాధికారం స్పీకర్‌కి ఉంటుంది. సరైన రీజన్ చూపించకుండా ఎగ్గొడితే అనర్హత వేటు వేస్తారు.
అందుకే పక్క రాష్ట్రంలో అసెంబ్లీకి ముఖం చాటేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలలు తిరిగే సరికి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభలో ప్రత్యక్షమయ్యారు. మరి ఆ విషయం తెలియనట్లు జగన్ బాయ్‌కాట్ నిర్ణయం ప్రకటించారు. తనతో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను కూడా రిస్క్‌లో పడేశారు. మరి అనర్హత వేటు భయంతో మున్ముందు అసెంబ్లీకి హాజరైతే అప్పుడేం సమాధానం చెప్తారో చూడాలి.