ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కోటంరెడ్డికి కీలక పదవి…

నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కోటంరెడ్డికి టీడీపీ ప్రభుత్వలో సముచిత ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అనుచరగణం భావించింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉన్న పోస్టు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. అయితే చంద్రబాబు తనకు తప్పకుండా న్యాయం చేస్తారని కోటంరెడ్డి నమ్మకంతో ఉన్నారంట. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో బాగా పాపులర్ అయింది. అంతకుముందు వరకు ఉన్న ఆయన పాపులారిటీ వైసీపీ మీద తిరుగుబాటుతో అంతకు పదిరెట్లు పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆయన వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ అవలంబిస్తున్న వైఖరిని తప్పుపడుతూ వచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ది సహకరించడం లేదని, ఎన్నికల హామీల అమలుకు నిధులు ఇవ్వడం లేదని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హైలెట్ అయ్యారు.

అప్పట్లో జగన్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, కాకాణి గోవర్దన్‌రెడ్డిలకే అంతో ఇంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇతన సీనియర్లను అసలు పట్టంచుకోలేదన్న విమర్శలున్నాయి. అయితే ఏనాడూ ఆ అసంతృప్తిని బయటపెట్టని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభివృద్ది విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగడుతూ పార్టీని ఇరుకునపెట్టారు. ఇక ఎన్నికల ముందు ఏడాది నుంచి ప్రభుత్వంతో పాటు పార్టీ అధిష్టానాన్ని తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షించారు. ఆయనకు కౌంటర్ ఇవ్వలేక సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రూరల్ లో ఎలాంటి హామీలు నెరవేర్చ లేకపోతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసమ్మతి బహుట ఎగురవేయడంతో నియోజకవర్గంలో ఆయనకు మద్దతు పెరిగింది.వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కోటంరెడ్డి క్రమంగా టీడీపీకి దగ్గరవుతూ వచ్చారు . లోకేశ్ పాదయాత్ర వంటి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ పార్టీ మైలేజ్ పెంచారన్న అభిప్రాయం ఉంది.

అదే సమయంలో జిల్లాలో వైసీపీకి అనేక మంది నేతలు రాజీనామా చేస్తున్నారని ప్రకటించి ఆయన కలకలం రేపారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు దాంతో వైసీపీ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై స్పీకర్‌తో అనర్హత వేటు వేయించింది. అయినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ముందుకే సాగారు తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి సిద్దమయ్యారు. దాంతో అనేకమంది ఆయన చూపిన బాటలోనే వైసీపీకి గుడ్ బై చెప్పారు.కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వంటి సీనియర్ల చేరికతో సింహపురి జిల్లాలో టీడీపీ సంస్థాగతంగా మరింత బలోపేతం అయింది. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కోటంరెడ్డికి తగు ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అనుచరవర్గం భావించింది.

అయితే నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రయారిటీ లభించకపోవడంపై ఆయన ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు. కోటంరెడ్డికి సముచిత స్థానం ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం తన భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసుకుంటారని.. అంతా మంచే జగురుతుందని సన్నిహితులతో చెప్తున్నారంట. మరి చూడాలి ఫ్యూచర్లో కోటంరెడ్డికి ఎలాంటి ప్రయారిటీ దక్కుతుందో.