తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030 పేరుతో కాలుష్య నియంత్రణ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ప్రమాదాల నివారణ, కాలుష్య నియంత్రణకు ఈ విధానం తెచ్చింది. జీవో నెంబర్ 41 ద్వారా తీసుకొచ్చే ఈ విధానం 2026 వరకు అమల్లో ఉంటుంది. తెలంగాణను కాలుష్యరహితంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారీగా రాయితీలు ఇస్తోంది. తెలంగాణలో విద్యుత్‌తో నడిచే టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్, బస్సులకు వంద శాతం పన్ను రాయితీ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలను రోడ్లపైకి భారీగా తీసుకురానుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 3 వేలకుపైగా ఈవీలను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా వినియోగదారుల డబ్బులు కూడా ఆదా ఆవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 31 డిసెంబర్ 2026 వరకు అమలులో ఉంటుంది.
రాష్ట్రంలో 15 సంవత్సరాల దాటిన వాహనాలు స్క్రాప్ చేయాలని చెప్పామని అందుకు తగ్గట్టుగానే జిల్లాల్లో ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలం చెల్లిన వాహనాలతో కాలుష్య మాత్రమే కాకుండా ప్రమాదాలు పెరిగిపోతున్నాయని అన్నారు మంత్రి. ఇలాంటివి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12 లక్షలు ఉన్నట్టు వెల్లడించారు. ఇందులో 75 శాతం టూ వీలర్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని కచ్చితంగా స్క్రీప్ చేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీతో అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. గతంలో ఉన్న నియంత్రణలు ఎత్తేయడంతో ప్రజలు కూడా ఈవీలను కొనేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్డు టాక్స్, రెట్రో ఫిట్మెంట్ ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వబోతోంది. టూ వీలర్లు నుంచి 4 వీలర్లు, కమర్శియల్ వెహికల్స్, టాక్సీలు, టూరిస్టు క్యాబ్‌లు, సొంత కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు వంటి దాదాపు పది రకాల వాహనాలకు 100శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, లైఫ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం రూ. 469కోట్ల వరకు వినియోగదారులకు పన్ను మినహాయింపులు లభించింది.
ఇందులో అందులో రూ.300 కోట్లు ఈవీలదే. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు పది రకాల వాహనాలకు పన్ను రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు అనుగుణంగానే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వాహన సారథిలో తెలంగాణ చేరుతుందన్నారు. వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్న ఆయన… లైసెన్స్ రోడ్ సేఫ్టీపై ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.