ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదో షాకింగ్ న్యూస్‌ అనే చెప్పవచ్చు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వర్గీకరణ ఈ నోటిఫికేషన్ నుంచే అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తితో దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే ఆలస్యమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేశారు. అయితే ముందుగా టెట్ నిర్వహించాలని చాలా మంది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం చేసి ముందుగా టెట్ నిర్వహించారు. ఈ మధ్య ఆ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు.

ఇప్పుడు నోటిఫికేషన్ వేసే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్న డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి. లేకుంటే వచ్చే డీఎస్సీ నాటికి తామంతా నష్టపోతామంటూ చాలామంది ఎస్సీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఓ ప్రత్యేక కమిషన్‌ను వేసింది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాను నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులతో స్కూల్స్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాస్త ఆలస్యమైనా సరే అనుకున్నట్టుగానే ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించింది. విలైతే సభలో ప్రకటించే అవకాశం లేకపోలేదు.

ఈ మధ్య కాలంలో పదే పదే డీఎస్సీ అంశాన్ని ప్రతిపక్షాలు సభలో ప్రస్తావిస్తున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే తాము ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వస్తుందని లోకేష్ పదే పదే చెబుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని అంటున్నారు. ముందు నుంచి అదే చెబుతున్నామని దానికి కట్టుబడి ఉన్నామని వివరిస్తున్నారు.