తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణపై బీఆర్‌ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈడీ కేసుల్లో ఆ ఫ్యామిలీని ఇరకాటంలో పెట్టి రేవంత్‌ను టార్గెట్ చేయాలని చూస్తోంది. లగచర్లలో మొదలైన వివాదం ఇప్పుడు మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ సేకరించే భూములు ఆయన ఆల్లుడి కోసమే అని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ వివాదంలోకి ఈడీని లాగేందుకు ఫిర్యాదుల చేస్తోంది. బీఆర్‌ఎస్ లీడర్ మన్నె క్రీశాంక్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. వివరాలు అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతోనే రేవంత్ అల్లుడి సంస్థ మాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీ ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. కొడంగల్‌లోని లగచర్ల సమీపంలో భూముల సేకరణ మాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీ కోసమే అని బీఆర్‌ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. రేవంత్ అల్లుడి కంపెనీకి తాము భూములు ఇవ్వబోమని అక్కడ రైతులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. కేసులు పెట్టి, బెదిరించి బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తోందని విమర్శలు చేస్తోంది.
మాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీలో రేవంత్ అల్లుడు సత్యనారాయణ డైరెక్టర్‌గా ఉన్నారని బీఆర్‌ఎస్ చెబుతోంది. ఆయనకు 16 లక్షల షేర్లు ఉన్నాయని వివరిస్తోంది. మరో డైరెక్టర్ అన్నం శరత్, ఆయన డైరెక్టర్‌గా ఉన్న ఇంకో కంపెనీకి 21 లక్షల షేర్లు ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాకుండా వీళ్లు వరంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వెళ్లడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాట్స్ అన్ని కలిపితే అసలు కుట్ర తెలుస్తుందని బీఆర్‌ఎస్ అంటోంది. ఈ కుట్రను ఛేదించేందుకు ఈడీ రంగంలోకి దిగాలని చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ అల్లుడి కుటుంబంపై ఈడీ కేసులు ఉన్నాయి. వివిధ అంశాల్లో కేసులు నమోదయ్యాయి. విచారణించిన దర్యాప్తు సంస్థ గొలుగూరి రామకృష్ణను నిందితుడిగా చేర్చింది. కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని నిధులను మళ్లించారని కూడా తేల్చింది.గొలుగూరి రామకృష్ణ, గొలుగూరి వెంకట్ రెడ్డి సోదరులే కాకుండా చాలా కంపెనీల్లో డైరెక్టర్లుగా వ్యాపారాలు చేస్తున్నారు. వీరి అబ్బాయి గొలుగూరి వెంకట్ రెడ్డి మాక్స్ బెయాన్ ఫార్మా డైరెక్టర్‌గా ఉన్నారు. ఈడీ పేర్కొన్నట్టు కోట్ల రూపాయలు ఈ కంపెనీలోకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు.
గొలుగూరి కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయని… వీటిని దృష్టిలో పెట్టుకొని ఈడీ రేవంత్ అల్లుడి మాక్స్ బెయాన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి ఆధారాలతో సహా గొలుగూరి కుటుంబం కేసులు, మాక్స్ బెయాన్ ఫార్మాలో రేవంత్ అల్లుడు సత్యనారాయణ వాటాల వివరాలు ఈడీకి అందజేశారు. ఫిర్యాదును స్వీకరంచిన ఈడీ రివ్యూ చేస్తామని చెప్పినట్టు క్రిశాంక్ తెలిపారు.