క్రీడలు ముఖ్యాంశాలు

Ind Vs Eng: తొలి టెస్టు డ్రా.. కోహ్లి స్పందన

‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. మూడు లేదా నాలుగో రోజు వర్షం పడుతుందనుకున్నాం. కానీ ఐదో రోజు వరుణుడు అడ్డుకున్నాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేం మెరుగైన స్థితిలో నిలిచాం. కచ్చితంగా టార్గెట్‌ పూర్తి చేయగలమనే నమ్మకంతో ఉన్నాం. కానీ.. దురదృష్టవశాత్తూ ఆడే వీలు లేకుండా పోయింది’’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. గెలిచే అవకాశాలు ఉన్న మ్యాచ్‌లో ఫలితం డ్రాగా తేలడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా కోహ్లి సేన ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆగష్టు 4న ప్రారంభమైన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఐదో రోజు ఆటను రద్దు చేస్తూ అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో.. పటిష్టమైన స్థితిలో నిలిచి.. విజయానికి చేరువలో ఉన్న కోహ్లి సేన(157 పరుగులు, చేతిలో 9 వికెట్లు)కు నిరాశే మిగిలింది. మొదటి టెస్టులో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉండాలని భావించిన టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లడంతో భంగపాటు తప్పలేదు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భారత సారథి కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌ విధించిన 209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు మెరుగ్గా రాణించారు. అదే జోష్‌లో ఐదో రోజు ఆటకు సిద్ధమయ్యాం. విజయం ముంగిట నిలిచాం. అప్పటి వరకు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మాదే పైచేయిగా ఉంది. కానీ ఆఖరి రోజు ఆట సాగించలేకపోవడం నిజంగా సిగ్గుచేటు’’ అని పేర్కొన్నాడు. కాగా, నాలుగో రోజు వికెట్‌ నష్టానికి టీమిండియా 52 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) పెవిలియన్‌ చేరగా.. 9 వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ వర్షం కారణంగా… టీమిండియా గెలిచే అవకాశం చేజారింది.