తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది. ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. గతంలో హిండెన్ బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పింది. అదానీ అంశం కారణంగా భారత దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలా మంది మధ్య తరగతి మదుపర్లు నష్టపోయారని అన్నారు.
అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించిన మేము ఆయనను రానివ్వలేదు. అదానీ మమ్మల్ని కలిసి వ్యాపారం చేస్తామని అడిగాడు. కానీ మేము ఆయనకు మర్యాద పూర్వకంగా ఛాయి తాగించి పంపించేశాం. అదానీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే ఎర్ర తివాచీలు కాంగ్రెస్ పరిచింది. కాంగ్రెస్ కు మాకు ఉన్న తేడా అదే. అదానీ విషయంలో బడే భాయ్ ఆదేశించగానే…చోటే భాయ్ అదానీకి రెడ్ కార్పేట్ వేసి స్వాగతం పలికాడు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదానీ సంస్థలతో రూ. 12, 400 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఘనంగా చెప్పుకున్నారు. 5000 కోట్లు గ్రీన్ ఎనర్జీ, 5000 కోట్లు డేటా సెంటర్, సిమెంట్ పరిశ్రమ పెట్టుబడులు ఇలా మొత్తం 12, 400 కోట్ల పెట్టుబడులు చేసుకున్నామని చెప్పారు.
తెలంగాణ డిస్కంల ను అదానీకి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ల డ్రామా మొదలుపెట్టారు. అదానీకి డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు. యాదాద్రిలోని రామన్న పేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏ మూసీ శుద్ధి అంటున్నారో అదే మూసీ సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మురికి మాయం అవుతుందని చెప్పిన పట్టించుకోలేదని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లుగా మమ అనిపించి అదానీకి సహకరించే పని చేశారు. పైన బడే భాయ్ ఆదేశించటంతో….కింద చోటా భాయ్ ఆచరించాడు. దీంతో అదానీ గుండె ఉప్పొంగిపోయి స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం ఇచ్చాడు. ఇవన్నీ వ్యవహారాలు కూడా కుట్ర అని మేము భావిస్తున్నాం. 12, 400 కోట్లతో తెలంగాణలో అదానీ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో 4 గంటల పాటు అదానీ సమావేశమయ్యారు. అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియదా? చిన్న కార్పొరేషన్ పదవికి కూడా కాంగ్రెస్ లో హైకమాండ్ పర్మిషన్ కావాాలె. మంత్రి వర్గ విస్తరణకు కూడా ఇప్పటి వరకు హైకమాండ్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటిది అదానీ తో ఒప్పందాలకు కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ లేదని భావించాలా? రోజు అదానీని విమర్శించే రాహుల్ గాంధీ ఈ ఒప్పందాలకు మద్దతిస్తున్నాడా? చెప్పాలి. పారిశ్రామిక వేత్తలు ఎవరూ ఊరికే విరాళాలు ఇవ్వరని మహారాష్ట్ర ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ చెప్పారు. నీకిది నాకది అని ఏదో పెద్దదే ఆశించి ఇస్తారని అన్నారు. మరీ ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 100 కోట్లు అదానీ నుంచి విరాళం తీసుకుంది. రాహుల్ గాంధీకి తెలిసి తీసుకున్నారా? లేకుంటే తెలియకుండా విరాళం తీసుకున్నారా?
కాంగ్రెస్ జాతీయ పార్టీ. దానికి దేశ వ్యాప్తంగా ఓకే విధానం ఉండాలి కదా? కానీ ఢిల్లీలో అదానీ మంచివాడు కాదు…గల్లీలో మాత్రం అదానీ మంచోడు. కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? బీజేపీది డబుల్ ఇంజన్ అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. మరీ వాళ్లది డబుల్ స్టాండర్డ్సా? అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ వాళ్లు గుడ్ అదానీ, బ్యాడ్ అదానీ అనే విధానం పాటిస్తున్నారు. వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చి, ఆర్థికంగా సాయం చేస్తే గుడ్ అదానీ అంటారు. అది వేరే పార్టీలతో కలిసి ఉండి వ్యాపారాలు చేస్తే బ్యాడ్ అదానీ అంటారు. తెలంగాణలో అదానీతో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.