తెలంగాణ రాజకీయం

శంకర్ నాయక్ పై కేసు

తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందంటూ.. ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ జిల్లా మానుకోటలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో మానుకోట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై భూ ఆక్రమణ కేసు నమోద కావడం.. జిల్లాలో సంచలనంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాయకులు చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే.. తెలంగాణ వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో గత ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నాయకుల అక్రమాలు, కబ్జాలు వెలుగు చూస్తున్నాయి. ఆ కోవలోనే మానుకోట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర నాయక్ పై భూ ఆక్రమ కేసు నమోదైంది. కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని శంకర్ నాయక్ బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నాడంటూ ఓ బాధితుడు పోలీసులకు విన్నవించుకోగా, అతనితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని భయపడిపోతున్నాడు.

పైడిపల్లిలోని ప్రశాంతి నగర్ కు చెందిన ప్రభుత్వం ఉపాధ్యాయురాలు రుద్రోజు పద్మావతి అనే మహిళకు న్యూ శాయంపేటలోని, దుర్గాదేవీ కాలనీలో 497 గజాల స్థలం ఉంది. ఈ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారు. ఆ స్థలంలోనే కంటైనర్ ను ఏర్పాటు చేసుకుని అందులో కొన్ని సామాన్లు సైతం ఉంచుకున్నారు. ఆ స్థలంపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే.. అక్కడికి తన మనుషుల్ని పంపించి.. స్థలాన్ని కబ్జా చేశాడు.
తన స్థలం చుట్టూ ప్రహరీ గోడను కూల్చి మరీ వేరే వాళ్లు ప్రవేశించడంతో.. అదేమని అడిగిన పద్మావతిపై తన అనుచరులతో దాడి చేశాడని.. బాధితురాలు పోలీసుల వద్ద వాపోయింది. తనకు పెళ్లి కానుకగా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని.. ఇలా ఓ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేయడంతో ఆ కుటుంబం లబోదిబోమంటోంది.ఈ స్థలాన్ని ఎలాగైనా తమనుంచి లాక్కోవాలని చూస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గతేడాది సైతం తన మనుషుల్ని పంపించి.. తమపై దౌర్జన్యం చేయించాడని బాధితురాలు చెబుతోంది. అప్పట్లో సైతం స్థానిక పోలీస్ స్టేషన్ లో క్రైమ్.నంబర్ 789/2023 న కేసు నమోదైందని, అయినా.. ఇప్పుడు మళ్లీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని విలపిస్తున్నారు.శంకర్ నాయక్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్న బాధితురాలు పద్మావతి.. ప్రభుత్వం స్పందించి తన భూమిని తనకు ఇప్పించాలని ప్రాధేయపడుతోంది. ఈ మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా… కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ బీఆర్ఎస్ నేతపై అనేక ఆరోపణలున్నాయి.

ఓసారి బహిరంగ వేదికపై నుంచి జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన శంకర్ నాయక్.. ఇష్టంవచ్చినట్లు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. తన గురించి ఏం రాయాలన్నా తనను అడిగి రాయాలని హుకుం జారీ చేశారు. అలాగే.. మరో సందర్భంలో హరితహారం కార్యక్రమంలో మహిళా కలెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. వేదికపైనే మహిళా కలెక్టర్ ని ఇబ్బందికరంగా తాకడంతో.. తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పుట్లో ఈ విషయంలో ఏకంగా కేసీఆర్ సైతం కలగజేసుకోవాల్సి వచ్చింది.