తెలంగాణ రాజకీయం

మూసీ వరం కావాలి...

హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి కానీ శాపం కావ‌ద్దొని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవంపై ఎక్స్ పోస్టులో సీఎం ఎమోష‌న‌ల్ అయ్యారు. న‌దుల వెంట నాగ‌రిక‌త వ‌ర్థిల్లాల‌ని, వాటిని క‌నుమ‌రుగ‌య్యేలా చేస్తే మ‌నిషి మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జారోగ్యం, ప‌టిష్ఠ ఆర్థిక‌ ప‌ర్యావ‌ర‌ణ కోణాల్లో ప్ర‌పంచస్థాయి ప్ర‌మాణాల‌తో అభివృద్ది చెందాల్సిన హైద‌రాబాద్ కు మూసీ ఒక వ‌రం కావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ శాపంలా మార‌కూడ‌ద‌ని చెప్పారు.మూసీని ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న‌దే తమ ప్ర‌భుత్వ సంక‌ల్పం అని తెలిపారు. ఇది ఈ త‌రానికే కాదు, భావి త‌రాల‌కు సైతం మేలు చేసే నిర్ణ‌యం అని పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యానికి అండ‌గా నిలిచే వ్య‌క్తికి, వ్య‌వ‌స్థ‌కు ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూసీ ప్ర‌క్షాళ‌న నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో నివ‌సించే వారిని ఖాళీ చేయాల‌ని కోరుతున్న సంగ‌తి తెలిసిందే. ఖాళీ చేసిన వారిని డ‌బుల్ బెడ్రూ ఇండ్ల‌కు త‌ర‌లిస్తూ వారికి నివాసం క‌ల్పిస్తోంది.అంతే కాకుండా ప‌ర్మిష‌న్ ఉన్న ఇండ్ల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ఈ క్ర‌మంలో కొంత‌మంది మాత్రం మూసీ ప్రాంతం నుండి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో ప్ర‌భుత్వంపై విమర్శ‌లు వ‌స్తున్నాయి. కూల్చివేత‌లు స‌రికాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ అనేక‌సార్లు మూసీ ప్ర‌క్షాళ‌న ఎందుకు చేస్తున్నారో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియా వేధిక‌గా మూసీ అంశంపై పోస్టు పెడుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు.