ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? : రామకృష్ణ

పులివెందులలో లాకప్ డెత్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. లాకప్ డెత్ జరగడం అమానుషమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు లేకుండా జగన్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. పులివెందుల లాకప్ డెత్‌పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, ఎస్‌ఐ గోపినాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రముఖుల ప్రమేయం ఉందని రామకృష్ణ చెప్పారు.

కాగా, కడప జిల్లా పులివెందుల పోలీసులు దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లో మృతి చెందినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మృతదేహాన్ని దహనం చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే యువకుడు చనిపోయాడన్న ప్రచారం జరుగుతుండగా, అలాంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నారు