రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు బూస్టర్ కోవిడ్ టీకా డోసు ( Booster Dose ) తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. దేశంలో మరోసారి కరోనా మహహ్మారి విజృంభిస్తోందని, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మళ్లీ కరోనా ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే వాళ్లంతా అదనపు డోసు టీకా తీసుకోవాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అమెరికాలో సుమారు మూడు శాతం మందిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇప్పటికే ఆ దేశంలో ఫైజర్, మోడెర్నా టీకాలను ఇచ్చారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్లు.. ఆయా టీకా అదనపు డోసులను తీసుకోవాలని ఎఫ్‌డీఏ కోరింది.
ఔషధాలు వాడుతున్నవారు.. ఇమ్యూనిటీని తగ్గించే వ్యాధులు ఉన్నవారు.. కోవిడ్ టీకాల నుంచి రక్షణ పొందనివారు.. మరో డోసు టీకాను తీసుకోవాలని ఎఫ్‌డీఏ తెలిపింది. అవయవ మార్పుడులు జరిగిన రోగుల్లో కోవిడ్ టీకాలతో కేవలం 15 శాతం మాత్రమే రక్షణ ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాంటి వారు మూడవ డోసు తీసుకోక తప్పదు. ట్రాన్స్‌ప్లాంట్ రోగుల్లో మూడవ డోసు అద్భుతంగా పనిచేస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం తేల్చింది.