2014లో దేశంలో శక్తిమంతమైన సర్కారు ఏర్పాటయ్యిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) అన్నారు. ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. డెలివరింగ్ డెమోక్రసీ పేరుతో దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభ సెషన్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. 2014కు ముందు దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండేది..? అని ప్రశ్నించారు.
నాటి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు ప్రధానిని ప్రధానిగా చూసేవారు కాదన్నారు. ఎవరికి వాళ్లు తమను తామే ప్రధానిగా భావించేవాళ్లని చెప్పారు. అప్పటి సర్కారుకు పక్షవాతం వచ్చిందన్నారు. రూ.12 లక్షల కోట్ల అవినీతితో దేశ ప్రతిష్ఠ దిగజారిందని తెలిపారు. దేశ అంతర్గత భద్రత కూడా ప్రశ్నార్థకంగా ఉండేదని పేర్కొన్నారు. పరిస్థితి ఎప్పుడు చూసినా ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ క్షణాన కుప్పకూలుతుందో అన్నట్లుగానే ఉండేదని చెప్పారు.