జాతీయం ముఖ్యాంశాలు

scrappage policy: వాహ‌నాల తుక్కు పాల‌సీని ప్రారంభించిన ప్ర‌ధాని.. ఏంటీ తుక్కు విధానం?

వాలంట‌రీ వెహికిల్ ఫ్లీట్ మోడెర్నైజేష‌న్ ప్రోగ్రామ్ లేదా వాహ‌నాల తుక్కు పాల‌సీ( scrappage policy )ని శుక్ర‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. గుజ‌రాత్‌లో జ‌రిగిన పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సులో వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్న మోదీ.. ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ తుక్కు పాల‌సీ రూ.10 వేల కోట్ల పెట్టుబ‌డుల‌ను తీసుకురానున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా మోదీ చెప్పారు. గుజ‌రాత్‌లోని అలంగ్ ఈ వాహ‌నాల తుక్కుకు హ‌బ్‌గా మార‌గ‌ల‌ద‌ని అన్నారు.

ప్ర‌స్తుతం ఉన్న తుక్కు పద్ధ‌తి అంత ప్ర‌యోజ‌న‌క‌రంగా లేద‌ని మోదీ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌త్య‌క్షంగా హాజ‌ర‌య్యారు. ఈ తుక్కు పాల‌సీ కార‌ణంగా ముడి స‌రుకుల ధ‌ర‌లు 40 శాతం వ‌ర‌కూ త‌గ్గుతాయ‌ని గ‌డ్క‌రీ అన్నారు. ఆటోమొబైల్ త‌యారీలో ఇండియా ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌గా మారుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో దేశంలోని అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.

ఏంటీ తుక్కు విధానం?

పాత‌, కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న త‌మ వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చ‌డానికి ముందుకు వ‌చ్చే య‌జ‌మానుల‌కు ఈ కొత్త విధానం కార‌ణంగా ల‌బ్ధి క‌ల‌గ‌నుంది. ఈ విధానంలో భాగంగా 15 ఏళ్లు పైబ‌డిన‌ వాణిజ్య వాహ‌నాలు, 20 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తిగ‌త వాహ‌నాలను తుక్కు చేయాల్సి ఉంటుంది. మొద‌ట ఈ విధానాన్ని ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు అమ‌లు చేయ‌నుండ‌గా.. ఆ త‌ర్వాత భారీ వాణిజ్య వాహ‌నాలు, వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు అమ‌లు చేస్తారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లోగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర ఉన్న 15 ఏళ్లు పైబ‌డిన వాహ‌నాల‌ను తుక్కుగా మార్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌ను 2024 జూన్ నుంచి తుక్కు కింద మ‌ల‌చ‌నున్నారు.