ముఖ్యాంశాలు

Haiti earthquake : హైతీ భూకంపం.. 1,300కు పెరిగిన మృతులు

కరేబియన్‌ ద్వీప దేశం హైతీలో భూకంపం పెను విలయం సృష్టించింది. భారీ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1,300 మంది దుర్మరణం చెందారు. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమవడంతో భవనాల కింద శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అమెరికా సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను మోహరించింది. శనివారం తెల్లవారు జామున హైతీలో రిక్టర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగాయి.

ఆదివారం తెల్లవారు జామున సైతం ప్రకంపనలు వచ్చాయి. భారీ భూకంపానికి వేలాది సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 1,300 మంది మృతి చెందారని దేశ పౌర రక్షణ సంస్థ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కరేబియన్‌ ద్వీప దేశంలో భూకంపం ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తుండగా.. పెను విధ్వంసానికి ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. భయంతో ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు.

భారీగా మట్టిపెళ్లలు వంటివి విరిగిపడటంతో సహాయక చర్యలకు కూడా విఘాతం కలుగుతోంది. ఎంతోమంది నిరాశ్రయులు కాగా.. భయంతో ప్రజలంతా రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ వీధులు, చర్చిల్లో కాలం గడుపుతున్నారు. మరో వైపు పెద్ద సంఖ్యలో జనం గాయాలకు గురవగా.. ఆసుపత్రులు నిండిపోయాయి. గత నెల 7న హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్‌ మోయిస్‌ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఇప్పటికీ ఆ దేశం షాక్‌లో ఉండగా.. భూకంపం మరింత విషాదంలోకి నెట్టింది. ‘నేటి భూకంపం హైతీకి రాజకీయ అస్థిరత.. హింస, కొవిడ్ -19, పెరుగుతున్న ఆహార అభద్రత మరో ఎదురుదెబ్బ’ అని యాక్టింగ్ హైతీ డైరెక్టర్ కారా బక్‌ పేర్కొన్నారు.