తెలంగాణ

Huzurabad | జెండా కాషాయం.. మాటల్లో విషం

  • ఆత్మగౌరవం కాదు.. ఈటలది ఆత్మవంచన
  • రాజేందర్‌ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం..
  • చేసే పనికి మాటలకు పొంతన లేదు
  • గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ వ్యక్తి కాదు ఒక శక్తి ..
  • కేసీఆర్‌ బాటలో అనేక ఉద్యమాలు చేసిండు
  • మా అందరి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి ..
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌లో వెల్లువలా చేరిన పలు గ్రామాల ప్రజలు

ఈటల రాజేందర్‌ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. కాషాయ జెండా కప్పుకొని, ఎర్ర జెండా డైలాగులు కొడుతున్నాడని విమర్శించారు. ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదని నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌లో మాజీ మావోయిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పులవేణి పోచమల్లు యాదవ్‌తోపాటు మాచనపల్లి, ఉప్పల్‌, దేశ్‌రాజ్‌పల్లి, గుండేడు, మల్యాల తదితర గ్రామాల నుంచి 500 మందికి పైగా ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్‌రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. వామపక్ష భావాల్లో పుట్టి పెరిగానని, తనదంతా లెఫ్టిజం అని చెప్పుకొని తిరిగే ఈటల.. రైటిస్టు పార్టీ బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నది నిజం కాదా ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఆత్మగౌరవం ప్రజలందరిది కాదని, ఆత్మగౌరవం అంటే ఆర్థిక స్వావలంబన సాధించడమని చెప్పారు. ఆ దిశగా రైతుబంధు, దళితబంధు వంటి అనేక పథకాలు తెచ్చి రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల ప్రజల్లో సీఎం కేసీఆర్‌ ఆత్మగౌరవాన్ని పెంచుతున్నారని పేర్కొన్నారు. రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని చెప్తున్న ఈటలకు ఆ మాట మాట్లాడే అర్హత ఉన్నదా అని నిలదీశారు. మత సంబంధ బీజేపీలో చేరిన తర్వాత వర్గ సంబంధం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఏ ఎండకు ఆ గొడుకు పడితే ఎలాగని ప్రశ్నించారు. ప్రజలు నాయకులకంటే తెలివైనవారని, అన్ని విషయాలు అర్థం చేసుకొంటారని పేర్కొన్నారు.

తలకాయ కిందకు పెట్టినా ఈటల గెలవడు
హుజూరాబాద్‌కు మంచి జరగాలని ఇక్కడి ప్రజలు కోరుకొంటున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తలకాయ కిందకు, కాళ్లు మీదికి పెట్టినా ఈటల గెలవడని జోస్యం చెప్పారు. ఒకవేళ గెలిస్తే సాధారణ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా హుజూరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏడేండ్లు మంత్రిగా ఉండి చేయలేని పనులు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి హుజూరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించగలడా అని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రజలు ఆలోచించాలని కోరారు. వ్యక్తి ప్రయోజనం ముఖ్యంకాదని, వ్యవస్థ ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టంచేశారు. వ్యక్తిగా ఈటల ప్రయోజనాల కోసం 2.29 లక్షల ఓటర్ల ప్రయోజనాలను ఎందుకు తాకట్టు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్‌కు కావల్సింది సెంటిమెంట్‌ డైలాగులు కాదని, సమగ్ర అభివృద్ధి జరగాలని కాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని చెప్పారు.

హుజూరాబాద్‌ గడ్డ.. టీఆర్‌ఎస్‌ అడ్డ
ఈటల గడియారాలు, గ్రైండర్లు, కుక్కర్లు, కుట్టు మెషిన్లు ఎన్ని పంచినా.. వచ్చే ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌, క్యాబినెట్‌ ఆశీస్సులతో గెలిచేది గెల్లు శ్రీనివాస్‌ అని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. గెల్లు ఒక వ్యక్తి కాదని ఆయన ఇప్పుడొక శక్తి అని ఉద్ఘాటించారు. హుజూరాబాద్‌ ప్రజలు ఈ ప్రలోభాలకు లొంగరని, ఇక్కడి ప్రజలు ఆలోచనా శక్తి ఉన్నోళ్లని పేర్కొన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకునే ప్రజలని తెలిపారు. 2001 నుంచి 2018 దాకా గులాబీ జెండాను తప్ప మరో జెండాను ఎత్తలేదని, హుజూరాబాద్‌ గడ్డ అంటేనే టీఆర్‌ఎస్‌కు అడ్డ అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్‌ ఎన్నికలైనా, లోకల్‌ ఎన్నికలైనా.. ఎప్పుడైనా టీఆర్‌ఎస్‌ను బలపర్చిన గడ్డ హుజూరాబాద్‌ అని పేర్కొన్నారు. గెల్లు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని, 2001 నుంచి టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, పార్టీ కోసం అనేక కష్టాలు పడ్డారని వివరించారు. ఓయూలో రబ్బర్‌ బుల్లెట్లను, భాష్పవాయువులను లెక్క చేయకుండా ముందుకు ఉరికిన ఉద్యమకారుడని కొనియాడారు.

ఈటలకు గుణపాఠం చెప్పాలి
టీఆర్‌ఎస్‌కు పదిమందికి సాయం చేయడమే తప్ప.. కీడు చేసే ఆలోచన ఉండదని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కానీ దురదృష్టవశాత్తు హుజూరాబాద్‌లో అందుకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం వంటి చర్యలు జరిగాయని, ఇందుకు మాజీ మావోయిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పులవేణి పోచమల్లు ఉదాహరణగా కనిపిస్తున్నారని తెలిపారు. ఆయనపై ఈటల 108 అక్రమ కేసులు పెట్టినట్టు తెలిసి పరేషాన్‌ అయ్యానని హరీశ్‌రావు చెప్పారు. ఒక కేసులో బెయిల్‌ రాగానే మరో కేసు పెట్టి జైలుకు పంపడం చాలా బాధాకరమని, ఇంత మానవత్వం లేకుండా ఉంటరా అని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈటల పెట్టిన కష్టాలకు తగిన గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో పోచమల్లు టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అన్నా, కేసీఆర్‌ అన్నా పోచమల్లుకు అమితమైన అభిమానం ఉన్నా.. ఈటల కారణంగా ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పారు. శ్రీనివాస్‌ను గెలిపించేందుకు పోచమల్లు వంటి వాళ్లు ఎందరో ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. పోచమల్లు హుజూరాబాద్‌లో డివిజన్‌లో విస్తృత ప్రజా సంబంధాలు కలిగిన వ్యక్తి అని, ఆయన విలువతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. ఆయన టీఆర్‌ఎస్‌లోకి రావడం చాలా సంతోషమని హరీశ్‌రావు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిఖార్సైన బీసీ బిడ్డకే ఓటువేయాలి
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో నిఖార్సైన బీసీ బిడ్డకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చిందని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. గెల్లు గెలుపు కోసం ప్రతి బీసీ బిడ్డ కృషిచేయాలని పిలుపునిచ్చారు. రాజేందర్‌ చారాన (పావలా) మందమే బీసీ అని ఎద్దేవాచేశారు. నియోజకవర్గంలో ఒక్క బీసీకి కూడా మేలు చేయలేదని విమర్శించారు. – మంత్రి గంగుల

కుట్రల మనిషి ఈటల
పోచమల్లు మొదటినుంచి తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తి అని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ కుట్రల మనిషి అని విమర్శించారు. ఆయన ఎవరి ఉన్నతిని ఓర్వలేడని మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కించే గుణం ఉన్న ఈటలను ఈ ఎన్నికల్లో పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. -కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు