జాతీయం ముఖ్యాంశాలు

పార్లమెంటులో చర్చలేవి?

  • చట్టాలు చేస్తున్న తీరు విచారకరం
  • వాటి ఉద్దేశమేంటో తెలియట్లేదు
  • బిల్లులపై అసలు చర్చే జరగట్లేదు
  • చట్టాల్లో లోపాలతో వివాదాలు
  • సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

చట్టాల రూపకల్పనలో పార్లమెంటు ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతుండటం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులపై విస్తృత చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తి ప్రకటించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టు ఆవరణలో నిర్వహించిన జెండావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ పాల్గొని మాట్లాడారు. చట్టాలపై నిర్మాణాత్మక చర్చలు జరగకపోవడం వల్ల వాటిల్లో గందరగోళం, అస్పష్టత ఉంటున్నదన్నారు. ఫలితంగా కేసుల విచారణ సందర్భంలో కోర్టులు చట్టాలకు సరైన భాష్యం చెప్పడం ఇబ్బందిగా మారిందన్నారు. ‘బిల్లులపై చర్చ జరగకపోవడం, చట్టాల్లో అస్పష్టత కారణంగా వాటి అసలు ఉద్దేశం, లక్ష్యం ఏమిటన్నది కోర్టులు అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఇలాంటి చట్టాల వల్ల వివాదాలతో కోర్టులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది’ అని జస్టిస్‌ రమణ వాపోయారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై జరిగిన చర్చను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘పారిశ్రామిక వివాదాల చట్టంపై పార్లమెంటులో జరిగిన చర్చ నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ చట్టం వల్ల కలిగే పరిణామాలు, శ్రామిక వర్గంపై దాన్ని ప్రభావాన్ని తమిళనాడు ఎంపీ రామ్మూర్తి చక్కగా వివరించారు. ఇలా చట్టాల ఉద్దేశం తెలిసినప్పుడు వాటిని విశ్లేషించడం కోర్టులకు సులువు అవుతుంది’ అని అన్నారు.

న్యాయవాదులు లేకపోవడం వల్లే
చట్టసభల్లో మేధావులు, న్యాయవాదులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు. గతంలో చట్టసభల్లో ఎక్కువగా న్యాయవాదులు ఉండేవారని, సభలు హుందాగా, ఫలప్రదంగా నడిచేవని తెలిపారు. తద్వారా చట్టాలను ఎందుకు రూపొందించారో కోర్టులకు స్పష్టత ఉండేదన్నారు. ఇటీవలి పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నప్పటికీ ఎలాంటి చర్చ లేకుండా 22 బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

లాయర్లు ప్రజాజీవితంలోకి వెళ్లాలి
దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపింది న్యాయవాదులే అని జస్టిస్‌ రమణ అన్నారు. మహాత్మా గాంధీ, జవహరలాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌ లాయర్లే అని గుర్తుచేశారు. న్యాయవాదులు కేవలం తమ వృత్తికే పరిమితం కావొద్దన్నారు. ప్రజాజీవితంలోకి వెళ్లాలని, సమాజ సేవ చేయాలని కోరారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్య హక్కులను ప్రజలకు అందేలా చూడటంలో కొన్నేండ్లుగా సుప్రీంకోర్టు కీలకపాత్ర పోషిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పుడు జెండా వందనం రోజులను జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. బెల్లం, పేలాలు ఇచ్చేవారని జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు.