ప్రస్తుతం అఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రపంచం మొత్తం తెలుసు. తాలిబన్లు.. అఫ్ఘాన్ మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుందని కూడా ప్రకటించారు. తాలిబన్లకు లొంగిపోయి అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో అఫ్ఘాన్ కొత్త ప్రెసిడెంట్‌గా తాలిబన్ కోఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌ను త్వరలోనే అఫ్ఘాన్ ప్రెసిడెంట్‌గా తాలిబన్లు ప్రకటించనున్నారు.
తాలిబన్లు.. అఫ్ఘాన్ మొత్తాన్ని హస్తగతం చేసుకుంటున్న సమయంలో ఈ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు కూడా ప్రపంచమంతా ఆపేరు గురించే చర్చిస్తోంది. ఇంతకీ.. ఎవరీ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్.. ఆయనకు తాలిబన్ సంస్థకు ఉన్న సంబంధం ఏంటి? తాలిబన్ ఫౌండర్ ముల్లా ఒమర్ తర్వాత అంతటి పవర్‌ఫుల్ లీడర్‌గా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం.
అబ్దుల్ ఘనీ పుట్టి పెరిగింది ఇక్కడే
అబ్దుల్ ఘనీ.. అఫ్ఘాన్‌లోని కాందహార్ అనే ప్రాంతంలో పెరిగాడు. కాందహార్ అనగానే గుర్తొచ్చే పేరు తాలిబన్లు. తాలిబన్ సంస్థను స్థాపించింది కూడా అక్కడే. ఇతర అఫ్ఘాన్ ప్రజలలాగానే.. అబ్దుల్ ఘనీ కూడా సోవియెట్ సేనల దాడికి గురయినవాడే. 1970 సమయంలో సోవియెట్ సేనలు.. అప్ఘాన్‌పై దాడి చేసినప్పుడు.. అబ్దుల్ కూడా ఆ దాడికి గురయ్యాడు. అదే ఆయన్ను సోవియెట్ సేనలపై తిరుగుబాటు చేసేలా ఉసికొల్పింది.
అప్పుడే ముల్లా ఒమర్‌తో కలిసి సోవియెట్ సేనపై పోరాటం చేశాడు. సోవియెట్ సేనలు అఫ్ఘాన్‌ను విడిచి వెళ్లిపోయాక అక్కడ అంతర్యుద్ధం రాజ్యమేలింది. అవినీతి పెరిగింది. దీంతో.. 1990లో ముల్లా ఒమర్.. అబ్దుల్ ఘనీతో కలిసి తాలిబన్ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2001 వరకు అఫ్ఘాన్‌ను తాలిబన్లే ఏలారు.
2001 తర్వాత హమిత్ ఖర్జాయ్.. అప్ఘాన్‌కు ప్రెసిడెంట్ అయ్యారు. ఆ సమయంలో.. తాలిబన్ తిరుగుబాటుదారులు ఖర్జాయ్‌ని కలిసి.. మిలిటెంట్లకు కూడా దేశాన్ని పరిపాలించే అవకాశం విషయమై డీల్ కుదుర్చుకున్నారు. ఆ తిరుగుబాటుదారులలో అబ్దుల్ ఘనీ కూడా ఉన్నాడు.
2010 నుంచి 2018 వరకు పాకిస్థాన్ చెరలో
2010 లో అబ్దుల్ ఘనీని పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. అప్పటి అప్ఘాన్ ప్రెసిడెంట్.. ఖర్జాయ్‌తో.. అబ్దుల్ ఘనీ చర్చలు జరపడాన్ని అడ్డుకోవడం కోసం ఘనీని పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. 2018 వరకు ఘనీని పాకిస్థాన్ తమ ఆధీనంలోనే ఉంచుకుంది. 2018లో అమెరికా ఒత్తిడి చేయడంతో అబ్దుల్ ఘనీని పాకిస్థాన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఘనీని ఖతర్‌కు పంపించి.. తాలిబన్ పొలిటికల్ ఆఫీస్‌కు హెడ్‌గా నియమించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో అబ్దుల్ ఘనీ చర్చలు
మార్చి 2020లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాలిబన్ మిలిటెంట్ గ్రూప్‌తో చర్చలు జరిపారు. అఫ్ఘాన్‌లో హింసను వెంటనే ఆపేయాలని ఆయన కోరారు. అఫ్ఘాన్‌లో యుద్ధం ముగించాలని ట్రంప్.. అబ్దుల్ ఘనీకి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన చరిత్రాత్మక యూఎస్, తాలిబన్ ఒప్పందం ఫిబ్రవరి 29న జరిగింది. దీంతో ఒక్కసారిగా అబ్దుల్ ఘనీ వార్తల్లోకెక్కారు. ప్రపంచానికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరు.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతూనే ఉన్నది.
ఏది ఏమైనప్పటికీ.. తాలిబన్లకు పాకిస్థాన్ నుంచి మద్దతు ఎక్కువగా లభించింది. తాలిబన్లు పోరాటయోధులు కానీ ఉగ్రవాదులు కాదు.. అంటూ పాకిస్థాన్ చాలాసార్లు వాళ్లకు మద్దతు పలికింది. మధ్య ఏసియాలో తాలిబన్లతో కలిసి రాజ్యమేలాలని పాకిస్థాన్ భావించి.. తాలిబన్లకు కావాల్సిన ఆయుధాలు, ఇతర సామాగ్రిని పాక్ సమకూర్చింది.. అని 1996లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.
పాకిస్థాన్.. తాలిబన్లకు అన్ని విధాలా సాయం చేసింది. అఫ్ఘాన్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తాలిబన్లవైపే పాక్ నిలిచింది. అన్ని విధాలా సపోర్ట్ చేసింది. ఆల్‌ఖైదాకు తాలిబన్లు సపోర్టు చేస్తున్నారని.. తాలిబన్ల మీద ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినప్పటికీ పాక్ మాత్రం తాలిబన్లకు మద్దతు ఇస్తూనే ఉంది.
పాక్ తర్వాత తాలిబన్లకు అంతటి మద్దతు లభించింది చైనా నుంచి. ఇటీవల చైనాను తాలిబన్ల బృందం సందర్శించినప్పుడు.. ఆ బృందానికి నాయకత్వం వహించింది అబ్దుల్ ఘనీనే. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో ఘనీ సమావేశమయ్యారు. అప్పటి నుంచే చైనా.. తాలిబన్లు.. అఫ్ఘాన్‌ను పాలించేందుకు అన్ని విధాలా అర్హులు అని పేర్కొనడానికి ఏమాత్రం సందేహించలేదు.
తాలిబన్లకు నాయకత్వం వహించిన ముఖ్య నాయకులు
తాలిబన్ల నాయకుడిగా ఉన్న ముల్లా మన్సూర్ అక్తర్‌ను 2016లో యూఎస్ డ్రోన్ ద్వారా అటాక్ చేసి చంపేసింది. దీంతో సుప్రీం లీడర్‌గా ఉన్న హైబతుల్లా అఖుంద్‌జాదా తాలిబన్ల లీడర్ అయ్యాడు. ఒక మిలిటరీ కమాండర్‌గా మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయన్ను తాలిబన్లు చూసేవారు. అఖుంద్‌జాదా తాలిబన్ లీడర్ అయ్యాక.. ఆల్ ఖైదాకు ఎక్కువగా నమ్మకంగా మెలిగేవాడు. ఆయన తర్వాత తాలిబన్ల నాయకుడిగా అబ్దుల్ ఘనీని నియమించారు. అబ్దుల్ ఘనీతో పాటు.. ప్రస్తుతం తాలిబన్ సంస్థలో సిరాజుద్దిన్ డిప్యూటీ లీడర్‌గా ఉన్నాడు. సోవియెట్‌లకు వ్యతిరేకంగా పోరాడిన జలాలుద్దీన్ కొడుకు సిరాజుద్దీన్. ఆ తర్వాత.. ముల్లా యాకూబ్.. మిలిటరీ కమిషన్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. తాలిబన్ సంస్థ ఫౌండర్ ముల్లా ఒమర్ కొడుకే ముల్లా యాకూబ్.
అఫ్ఘాన్‌లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి?
అఫ్ఘాన్ ప్రస్తుతం తాలిబన్ల కంట్రోల్‌లో ఉంది. తాలిబన్లకు లొంగిపోయిన అఫ్ఘాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ.. దేశాన్ని వదిలి పారిపోయారు. 2001 లో తాలిబన్లు అప్ఘాన్ పాలన నుంచి వైదొలిగాక.. 20 ఏళ్లకు మళ్లీ అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్నారు. అఫ్ఘాన్ ప్రభుత్వం కుప్పకూలగానే.. తాలిబన్లు.. కాబుల్‌లోని అధ్యక్ష భవనాన్ని ఆక్రమించారు. దీంతో రాజధాని వ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. దీంతో అప్ఘాన్‌ను వీడేందుకు ఆ దేశ ప్రజలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అప్ఘాన్ ప్రజలు గుంపులు గుంపులుగా చేరి.. విమానాలు ఎక్కి వేరే దేశాలకు వలసపోతున్నారు. కేవలం 10 రోజుల్లో అప్ఘాన్ మొత్తాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకొని.. త్వరలోనే తమ కొత్త ప్రెసిడెంట్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరును ప్రకటించనున్నారు.