అంతర్జాతీయం క్రీడలు జాతీయం ముఖ్యాంశాలు

India Vs England: ‘లార్డ్స్‌’లో భారత ఘనవిజయం

రెండో టెస్టులో 151 పరుగులతో ఘన విజయం

బ్యాటింగ్‌లో రాణించిన షమీ 

బుమ్రా, సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌ 

ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌

రెండో ఇన్నింగ్స్‌లో 120కే ఆలౌట్‌

రిషభ్‌ పంత్, ఇషాంత్‌ శర్మ…. ఈ ఇద్దరు ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌లో పంత్‌ ఒక్కడే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌. అతడు అవుటైతే ఇంకో ఐదో పదో పరుగులకు కూలిపోవచ్చనే సందేహం… ఇషాంత్‌కు ముందే పంత్‌ ఔటయ్యాడు. తర్వాత ఇషాంత్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. కానీ అనుకున్నట్లుగా ఇన్నింగ్స్‌ కూలలేదు సరికదా అసలు మరో వికెటే పడలేదు! బంతులతో చెలరేగే బౌలర్లు షమీ, బుమ్రా బ్యాటింగ్‌తో అద్భుతమే చేశారు. వికెట్‌ పతనాన్ని అక్కడితోనే ఆపేసి… పరుగులకు బాట వేశారు.  తర్వాత మళ్లీ వాళ్లిద్దరే ఇంగ్లండ్‌ ఓపెనర్లను డకౌట్‌ చేసి పతనానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌ ఆఖరి వికెట్‌ తీసి శుభం కార్డు వేయడంతో లార్డ్స్‌ మైదానంలో భారత్‌ అద్భుత విజయాన్ని అందుకుంది.

‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’…ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లి చెప్పిన మాట ఇది! అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్‌లో, ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు గెలిచే వరకు ఆగలేదు. భారత్‌కు లార్డ్స్‌లో అద్భుత విజయాన్నిచ్చారు. రెండో టెస్టులో ఆఖరి రోజు మొదట భారత బౌలర్లు బ్యాటింగ్‌లో ‘కింగ్‌’లయ్యారు. తిరిగి బౌలింగ్‌తో బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. రెండో టెస్టులో భారత్‌ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


కష్టాల్లో ఉన్న భారత్‌ను షమీ (70 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) ఆదుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌ను 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది తర్వాత ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్‌ చేతిలో 3 వికెట్లు ఉండటంతో డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్‌ (9)ను అవుట్‌ చేసి బుమ్రా బాట వేయగా…ఒకే ఓవర్లో బట్లర్‌ (25), అండర్సన్‌ (0)లను పెవిలియన్‌ పంపించి సిరాజ్‌ ముగిం చాడు. ఈ గెలుపుతో  ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 181/6తో సోమవారం ఆట ప్రారంభించిన  అనం తరం రిషభ్‌ పంత్‌ (22) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాంత్‌ (16) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో షమీ–బుమ్రా భాగస్వామ్యం అద్భుతాన్నే చేసింది.
 
సిరాజ్‌కు 4 వికెట్లు
భారత్‌ నిర్దేశించిన లక్ష్యం 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్‌ సహా టాపార్డర్‌ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్‌ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్‌ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్‌ (9), బెయిర్‌ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్‌ రూట్‌ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్‌ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్‌లోకి ఈ సారి సిరాజ్‌ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్‌ అలీ (13), స్యామ్‌ కరన్‌ (0)లను ఔట్‌ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్‌ చేర్చాడు.

షమీ–బుమ్రా బ్యాటింగ్‌ సత్తా
మనం డ్రా చేసుకుంటే చాలనుకునే పరిస్థితి నుంచి ప్రత్యర్థి డ్రాతో గట్టెక్కితే చాలనే స్థితికి తీసుకొచ్చిన మహ్మద్‌ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) ఇంగ్లండ్‌ బౌలర్ల భరతం పట్టారు. బంతులేసే బౌలర్లు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కంటే బాగా ఆడారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ అందుబాటులో ఉన్న అస్త్రాల్ని ప్రయోగించాడు. మార్క్‌వుడ్, రాబిన్సన్, స్యామ్‌ కరన్‌ ఇలా ఎవరిని దించినా బుమ్రా, షమీ తగ్గలేదు. అలా అని టిక్కుటిక్కు అని డిఫెన్స్‌కే పరిమితం కాలేదు. క్రీజులో పాతుకుపోయే కొద్దీ షాట్లపై కన్నేశారు. బంతిని బౌండరీలైనును దాటించారు.

ఇద్దరు టెస్టు ఆడినా… పరుగుల వేగం వన్డేలా అనిపించింది. ముఖ్యంగా 40 పరుగుల వద్ద ఉన్న షమీ వరుస బంతుల్లో 4, 6 కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం. మొదట లాంగాన్‌లో బౌండరీ బాదిన షమీ మరుసటి బంతిని ముందుకొచ్చి డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అది కాస్తా ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఈ ఇద్దరి సమన్వయం కుదరడంతో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళం చెదిరింది. ఈ జోడీని విడగొట్టే ప్రయత్నం ఫలించక, అటు పరుగులకు అడ్డుకట్ట వేయలేక ఆపసోపాలు పడ్డారు. అబేధ్యమైన భాగస్వామ్యం ఎంతకీ ముగియకపోగా, చివరకు భారత్‌ డిక్లేర్‌ చేసింది. అజేయమైన తొమ్మిదో వికెట్‌కు 20 ఓవర్లలోనే  షమీ, బుమ్రా 89 పరుగులు జోడించారు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 364 ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 391 భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 5; రోహిత్‌ (సి) మొయిన్‌ అలీ (బి) వుడ్‌ 21; పుజార (సి) రూట్‌ (బి) వుడ్‌ 45; కోహ్లి (సి) బట్లర్‌ (బి) కరన్‌ 20; రహానే (సి) బట్లర్‌ (బి) అలీ 61; పంత్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 22; జడేజా (బి) మొయిన్‌ అలీ 3; ఇషాంత్‌ (ఎల్బీ) (బి) రాబిన్సన్‌ 16; షమీ నాటౌట్‌  56; బుమ్రా నాటౌట్‌ 34; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (109.3 ఓవర్లలో) 298/8 డిక్లేర్డ్‌ వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175, 7–194, 8–209. బౌలింగ్‌: అండర్సన్‌ 25.3–6–53–0, రాబిన్సన్‌ 17–6–45–2, వుడ్‌ 18–4–51–3; కరన్‌ 18–3–42–1, అలీ 26–1–84–2, రూట్‌ 5–0–9–0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) పంత్‌ (బి) షమీ 0; హమీద్‌ (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 9; రూట్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 33; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 2; బట్లర్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 25; అలీ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 13; కరన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0; రాబిన్సన్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 9; వుడ్‌ నాటౌట్‌ 0; అండర్సన్‌ (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (51.5 ఓవర్లలో ఆలౌట్‌) 120.  వికెట్ల పతనం: 1–1, 2–1, 3–44, 4–67, 5–67, 6–90, 7–90, 8–120, 9–120, 10–120. బౌలింగ్‌: బుమ్రా 15–3–33–3; షమీ 10–5–13–1, జడేజా 6–3–5–0, సిరాజ్‌ 10.5–3–32–4, ఇషాంత్‌ 10–3–13–2.