ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత అల్లకల్లోలంగా ఉంది. గతంలో వాళ్ల రాక్షస పాలనను ప్రత్యక్షంగా చేసిన ఆఫ్ఘన్లు.. ఇల్లూ వాకిలి వదిలేసి మరీ వేరే దేశాలకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను ఎలా పోటెత్తారో చూశాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నారు. కానీ అక్కడి వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో పూజారిగా ఉన్న పండిత్ రాజేష్ కుమార్ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్ఘనిస్థాన్‌ను వదిలేదంటున్నారు.
తాలిబన్లు చంపితే చంపనీ.. వాళ్లు చంపినా అది నా సేవలాగే భావిస్తా అని ఆయన అంటున్నారు. రతన్‌నాథ్ ఆలయంలో రాజేష్ కుమార్ పూజారిగా ఉన్నారు. ఆయనే కాదు కొన్ని వందల ఏళ్లుగా ఆయన పూర్వీకులు కూడా ఆ ఆలయ సేవలోనే ఉన్నారు. అలాంటి ఆలయాన్ని తాను వదిలేసి వెళ్లనని రాజేష్ అంటున్నారు. కొంతమంది హిందువులు నన్ను కాబూల్ విడిచి వెళ్లమన్నారు. వాళ్లే నా ప్రయాణానికి, నేను ఉండటానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. కానీ ఈ ఆలయంలో నా పూర్వీకులు వందల ఏళ్లుగా సేవ చేశారు. నేను ఈ గుడిని వదలలేను. తాలిబన్లు చంపితే, నేను దాన్ని నా సేవగా భావిస్తాను అని రాజేష్ పండిత్ అనడం గమనార్హం.