ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్ట్ విజయంలో సెంచరీతో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కేఎల్ రాహుల్( KL Rahul ).. మ్యాచ్ తర్వాత ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తన పనేదో తాను చేసుకెళ్తూ.. ఫీల్డ్‌లో చాలా కామ్‌గా కనిపించే రాహుల్ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించాడు. రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్స్ పదే పదే రెచ్చగొట్టేలా వ్యవహరించిన విషయం తెలిసిందే. మొదట ఆండర్సన్-కోహ్లి, బుమ్రా-బట్లర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీనిపైనే రాహుల్ ఇలా స్పందించాడు. మీరు టీమ్‌లో ఒక్కరిని వేధిస్తే.. మొత్తం టీమ్‌లోని 11 మందీ మీ వెంట పడతారు అని ఇంగ్లండ్‌కు దిమ్మదిరిగే హెచ్చరికలు జారీ చేశాడు.
రెండు బలమైన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు అత్యుత్తమ ఆటతోపాటు కొన్ని మాటల యుద్ధాలు కూడా సహజమే. అయితే ఇది ఓ మోస్తరు వరకూ బాగానే ఉంటుంది కానీ శృతి మించకూడదు. మీరు ఒక్కరి వెంట పడితే.. మా టీమంతా మీ వెంట పడుతుంది అని రాహుల్ అనడం విశేషం. ఈ స్ఫూర్తితోనే మా టీమంతా ఒక్కటిగా ముందుకు వెళ్తుంది అని అతడు చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 129 పరుగులు చేసి టీమ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించిన రాహుల్ ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.