తెలంగాణ ముఖ్యాంశాలు

దళితబంధు దేశానికే రోల్‌మోడల్‌

  • సీఎం కేసీఆర్‌ దార్శనికుడు.. పెద్ద కలలు కంటారు.. నిజంచేస్తారు
  • ప్లాస్టిక్‌ వాడొద్దని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం
  • ప్రత్యామ్నాయాన్ని మాత్రం చూపడం లేదు
  • నియోజకవర్గాల పునర్విభజనపై
  • శాస్త్రీయ విధానం అవసరం
  • నేను ఐఏఎస్‌ కావాలని నాన్న కోరుకొన్నారు
  • ఆయనకు తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చా
  • కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌పాలసీ విద్యార్థులతో ముఖాముఖిలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ ఉన్న నేత అని.. ప్రజల కోసం పెద్ద పెద్ద కలలు కని, వాటిని సాకారం చేస్తారని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని సవాలుగా తీసుకొని వందశాతం అమలు చేస్తారని చెప్పారు. సీఎం రూపకల్పన చేసిన రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలను రోల్‌మోడల్‌గా తీసుకుని కేంద్రం, ఇతర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. దళితబంధు పథకం కూడా దేశానికి రోల్‌మోడల్‌ అవుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇతర వర్గాలకోసమూ వర్తింపజేస్తారేమోనని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్‌ యూనివర్సిటీలోని ‘కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ విద్యార్థులతో జరిగిన మంగళవారం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. విద్యార్థుల ప్రశ్నలకు జవాబులిచ్చారు.

దళితబంధు దేశానికి రోల్‌మోడల్‌ ..

‘సీఎం కేసీఆర్‌ రూపొందించిన దళితబంధు దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దళితులు వివక్షకు గురయ్యారు. రిజర్వేషన్లు అమలుచేసినా అభివృద్ధి చెందలేదు. దళితుల బతుకుల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక నిర్ణయం తీసుకొన్నారు. సీఎం కేసీఆర్‌ పెద్ద పెద్ద కల లు కంటారు. వాటిని సాకారం చేస్తారు. తెలంగాణలో 16 నుంచి 17 శాతం దళితులు ఉన్నారు. వీరిని తెలంగాణ ప్రభుత్వం నిర్ల క్ష్యం చేయజాలదు’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దళితబంధు ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామని, ఈ నిధులతో డెయిరీలు, రైస్‌మిల్లులు, మైక్రో యూనిట్లను దళితులు ఏర్పాటు చేసుకొంటారని పేర్కొన్నారు. ఈ 10 లక్షలు ఎలా ఖర్చు చేస్తున్నది కలెక్టర్‌, నోడల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తారని చెప్పారు. దళిత కుటుంబాలు ఎదిగే మార్గాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం పథకాలపై ఖర్చుచేసే ప్రతి రూపాయి తిరి గి పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుందని వెల్లడించారు.

తెలంగాణ ఆత్మహత్యలు కనిపించడం లేదన్న కేంద్రం

సమైక్య రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, అనంతపురం జిల్లాల్లో కరువు, వలసలు, రైతు ఆత్మహత్యలు ఎక్కువగా కనిపించేవని, తె లంగాణలో ప్రస్తుతం రైతు ఆత్మహత్యలు కనిపించడం లేదని కేం ద్రమే పార్లమెంట్‌లో ప్రకటించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ నీటిపారుదల, వ్యవసాయరంగంలో విప్లవాత్మకమా ర్పులు తేవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. పెట్టుబడిగా రైతుబంధు, సాగునీటికోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని తెలి పారు. తాను అమెరికాలోని మిన్నెసోటా గవర్నర్‌ను కలిసినప్పుడు తమ రాష్ట్రంలో పదివేల చెరువుల గురించి అబ్బురంగా చెప్తే తాను తెలంగాణలో 46 వేల చెరువులు ఉన్నట్టు వివరించానని చెప్పారు.

మోదీ కర్‌ నహీ పాయా.. ఆప్‌ క్యా కరేంగే అన్నారు!

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తాను.. మరికొందరు అధికారులతో గుజరాత్‌ వెళ్లి అక్కడ అమలులో ఉన్న తాగునీటి సరఫరా వ్యవస్థను చూశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సీఎం హో దాలో మోదీ గుజరాత్‌లోని 70 శాతం ఇండ్లకు తాగునీటిని సరఫరా చేయగలిగారని పేర్కొన్నారు. ఇంటింటికీ నల్లా నీటిపై సీఎం కేసీఆర్‌ విజన్‌ గురించి అక్కడి అధికారులతో చెప్పినప్పుడు ‘మోదీజీ కర్‌ నహీ పాయా.. నయా స్టేట్‌హై.. ఆప్‌ క్యా కరేంగే’ అని తమతో జోక్‌చేశారని తెలిపారు. కానీ మూడున్నరేండ్లలో విజయవంతం చేశామని చెప్పారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు వేసిన సమయంలోనే ఇంటింటికీ ఇంటర్నెట్‌ ఇచ్చేందుకు ప్రతి గ్రామానికి ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ వేశామని, త్వరలోనే ఫైబర్‌ గ్రిడ్‌ను ప్రారంభించనున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మిషన్‌ భగీరథ పథకాన్ని రోల్‌మోడల్‌గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ పేరుతో దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నదని తెలిపారు.

మూడో అతి పెద్ద విప్లవం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనాధక్షుడేకాక పర్యావరణవేత్త అని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. హరితహారం ద్వారా తెలంగాణలో మూడో అతిపెద్ద విప్లవం తెచ్చినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పా టుకు ముందు రాష్ట్రంలో 23% అటవీ విస్తీర్ణం ఉండగా హరితహారం అమలు తర్వాత 28 శాతానికి పెరిగినట్టు చెప్పారు.

1.39 లక్షల మందికి సర్కారు ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో ముందున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.39 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.2.2 లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి 15 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. కేంద్రం జోనల్‌ వ్యవస్థపై స్పష్టత ఇవ్వకపోటంతో ఇబ్బందులు తలెత్తాయని, ప్రస్తుతం ఆ సమస్య తీరడంతో రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.

దళితబంధు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు?: పూనమ్‌కౌర్‌, సినీ నటి

మంత్రి కేటీఆర్‌: దళితబంధుపై సందేహాలు సహజమే. గతంలో మేము తెచ్చిన రైతుబంధుపైనా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు రైతుబంధు నిర్విరామంగా, గొప్పగా కొనసాగుతున్నది. రైతులకు కొండంత అండగా నిలిచింది. ఈ పథకం విజయాన్ని దేశంలోనే గర్వంగా చెప్పుకొంటున్నారు. 11 రాష్ర్టాల్లో వివిధ పేర్లతో రైతులకు నగదు బదిలీ చేస్తు న్నారు. ప్రధాని కూడా రైతుల అకౌంట్లలో నగదు జమ చేయిస్తున్నారు. మేమే ట్రెండ్‌ సెట్‌చేశాం. దళితులు బాగా వెనుకబడ్డారని అ నేక సర్వేలు చెప్తున్నాయి. మేము దళితబం ధు పథకంతో రూ.10 లక్షలు ఇచ్చివారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చూస్తున్నాం. వారికి రూ.1.75 లక్షల కోట్లు అందజేస్తాం. వారిని నిర్లక్ష్యం చేస్తే అసమానతలు పెరుగుతాయి. ఇప్పుడు ఆఫ్ఘన్‌ చూడండి. పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు ఎంత నష్టం చేకూర్చిందో. మేము దళితుల జీవితాల్లో స్వర్ణకాంతులు నింపుతాం.

కేంద్ర ప్రభుత్వం తీరు చాలా అంశాల్లో సరిగ్గాలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం విధించిన కేంద్రం.. దానికి ప్రత్యామ్నాయం చూపటంలేదని చెప్పారు. స్టాండ్‌అప్‌ ఇండియా-స్టార్‌అప్‌ ఇండియా స్లోగన్‌ ఇచ్చి, రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి విడుదలచేయలేదని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరు సరిగ్గాలేదని మండిప డ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై శాస్త్రీయవిధానం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గీతం వర్సిటీ అదనపు వీసి శివప్రసాద్‌, కౌటిల్య డీన్‌ సయ్యద్‌ అక్బరుద్దీ న్‌, రెసిడెంట్‌ డైరెక్టర్లు వర్మ, మనికా రైక్వార్‌ పాల్గొన్నారు.

నేను ఐఏఎస్‌ కావాలని నాన్న అనుకొన్నారు

నాయకుడిగా తాను ఎదిగిన క్రమాన్ని విద్యార్థులతో మంత్రి కేటీఆర్‌ పంచుకున్నారు. ‘నాన్న కేసీఆర్‌ నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు. నన్ను ఐఏఎస్‌గా చూడాలనుకొన్నారు. అందుకోసం నన్ను ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో రెండు నెలలపాటు నా మిత్రులతో కలిసి ఉన్నా ను. జేఎన్‌యూలోని ఓ గోడపై ‘ఎవ్రీథింగ్‌ డిసైడెడ్‌ బై పాలిటిక్స్‌, యు బెటర్‌ డిసైడ్‌ వాట్‌ ఈజ్‌ ఫ్యూచర్‌ పాలిటిక్స్‌’ అని రాసి ఉన్నది. ఇది నాలో ఆలోచనలు రేకెత్తించింది. దీంతో ఐఏఎస్‌ శిక్షణ తీసుకోకుండానే ఎంబీఏ చేసేందుకు అమెరికా వెళ్లా ను. ఎంబీఏ పూర్తయ్యాక అక్కడే స్టాఫ్‌వేర్‌ కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశాను. సౌత్‌ ఏషియా హెడ్‌గా ముంబై కేంద్రం గా పనిచేశాను. బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌ దేశాల్లో పర్యటించా ను. పాకిస్తాన్‌ వీసా లభిస్తే అక్కడికి వెళ్లేవాడిని, కానీ లభించలేదు. తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో నేను ఉద్యోగం వదిలేసి, నాన్న అనుమతి లేకుండానే రాజకీయాల్లోకి ప్రవేశించాను. మొదట పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేసి ఆ తర్వాత పార్టీ జనరల్‌ సెక్రటరీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నాను.

విద్యార్థుల్లో కేటీఆర్‌కు క్రేజ్‌..

సమావేశ మందిరంలోకి మంత్రి కేటీఆర్‌ ప్రవేశించగానే విద్యార్థులు, బోధనా సిబ్బంది పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ స్వాగతం పలికారు. విద్యార్థులతో కేటీఆర్‌ ముఖాముఖి గంటకుపైగా కొనసాగింది. కేటీఆర్‌ చెప్పిన ప్రతి విషయాన్ని విద్యార్థులు ఆసక్తిగా ఆలకించారు. పలు సందర్భాల్లో కేటీఆర్‌ స్పీచ్‌కు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ముఖాముఖి ముగిసిన అనంతరం కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. నాయకులు కలలు కంటారు.. నిజం చేస్తారు నాయకులు కలలు కంటారు. వాటిని నిజం చేసేందుకు శ్రమిస్తారు. వారు శ్రమించిన తీరుతోనే కలలు నిజమవుతాయి. సీఎం కేసీఆర్‌ మా ఇంటికి ఎవరైనా అతిథిగా వస్తుంటే వారికి అందజేసే అల్పాహారంలో ఏమేం ఉండాలో మాకు ముందుగానే చెప్తారు. అతిథి ఇష్టాయిష్టాలు వివరిస్తారు. ఇక్కడ చూడాల్సింది ఆయన గొప్పదనం. చిన్న విషయమైనా ఆయన పట్టించుకుంటారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణంలోనూ సూక్ష్మమైన విషయాలను కూడా సీఎం పట్టించుకొన్నారు. భూ సేకరణ సమయంలో వీఆర్వోలతో కూడా నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఆ ప్రాజెక్టు సక్సెస్‌ అయితే లక్షల ఎకరాలకు నీరందజేయాలనే తపన.. ఆయన సీఎం అనే హోదాను కూడా మరిచి శ్రమించేలా చేసింది. కాళేశ్వరం మా స్వప్నం. దాన్ని నిజం చేస్తే లక్షలమంది రైతులకు లాభం కూడా. నాయకత్వం సరిగ్గా ఉండాలి.