హైతీలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. గత శనివారం వచ్చిన ప్రకంపనల ధాటికి పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు తొలగించిన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. ప్రకంపనలతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,941కు పెరిగిందని దేశ పౌర రక్షణ సంస్థ మంగళవారం తెలిపింది. ఇప్పటికే భూకంపం ధాటికి జనం విలవిలలాడుతుండగా.. తుఫాను ప్రభావంతో కుండపోత వర్షం కురుస్తున్నది.
పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో శనివారం తెల్లవారు జామున భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 9,900 మందికిపైగా గాయపడగా.. 76వేలకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. విపత్తు కారణంగా అర మిలియన్లకుపైగా పిల్లలు ప్రభావితమయ్యారని యూనిసెఫ్ తెలిపింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తీర ప్రాంత పట్టణమైన లెస్‌కేస్‌లో నిర్వాసితులు ఫుట్‌బాల్ మైదానాలు, చర్చిల్లో ఆశ్రయం పొందారు.
ఇదిలా ఉండగా.. వర్షాల నేపథ్యంలో వరదలు సంభవించే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ ఫ్లాష్ అండ్ అర్బన్ హెచ్చరించింది. భూకంపం ప్రభావంతో బీటలు వారిన భవనాల్లో నీరు చేరి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పింది. భారీ వర్షాలతో ప్రజలకు తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూకంపం ప్రభావిత నాలుగు ప్రావిన్సుల్లో ప్రభుత్వం నెల రోజుల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గత 48 గంటల్లో రెస్క్యూ వర్కర్లు 34 మందిని సజీవంగా శిథిలాల నుంచి బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు.