అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Facebook Bans Talibans : తాలిబ‌న్ల‌కు షాకిచ్చిన ఫేస్‌బుక్‌.. వాట్స‌ప్‌, ఇన్‌స్టాగ్రామ్ కూడా

ప్ర‌స్తుతం అఫ్ఘ‌నిస్థాన్‌లో ఎటువంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో అంద‌రికీ తెలిసిందే. తాలిబ‌న్లు.. అఫ్ఘ‌నిస్థాన్‌ను ఆక్ర‌మించుకొని.. అక్క‌డ త‌మ జెండాను ఎగుర‌వేశారు. దీంతో అఫ్ఘాన్ ప్ర‌ధాని కూడా తాలిబ‌న్ల‌కు త‌ల‌వంచి.. దేశం వ‌దిలి పారిపోయాడు. అష్ర‌ఫ్ ఘ‌నీ.. దేశం వ‌దిలి పారిపోవ‌డంతో.. అప్ఘాన్ ప్ర‌జ‌లు కూడా అఫ్ఘ‌నిస్థాన్‌లో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. అందుకే.. అఫ్ఘాన్ నుంచి పారిపోయేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ల‌కు చేరుకొని.. అక్క‌డ ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కేస్తున్నారు. దేశం దాటేస్తున్నారు. ఇక‌.. త్వ‌ర‌లోనే అఫ్ఘాన్ నూత‌న అధ్య‌క్షుడిగా తాలిబ‌న్ లీడ‌ర్ అబ్దుల్ ఘ‌నీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తున్న నేపథ్యంలో తాలిబ‌న్ల‌కు ప్ర‌ముఖ సోషల్ మీడియా నెట్‌వ‌ర్క్ ఫేస్‌బుక్ షాకిచ్చింది.

తాలిబ‌న్ల‌ను, వాళ్ల అకౌంట్ల‌ను, వాళ్ల‌కు సంబంధించిన అనుకూల‌మైన స‌మాచారం మొత్తాన్ని ఫేస్‌బుక్ బ్యాన్ చేసింది. అఫ్ఘాన్ ఎక్స్‌పర్ట్స్‌తో డెడికేటెడ్ టీమ్‌ను ఏర్పాటు చేయించిన ఫేస్‌బుక్‌.. తాలిబ‌న్ గ్రూప్‌తో సంబంధం ఉన్న ప్ర‌తి కంటెంట్‌, అకౌంట్స్ అన్నింటినీ తొల‌గిస్తోంది. అఫ్ఘాన్‌లో మాట్లాడే ద‌రి, పాష్తో అనే భాష‌ల‌కు సంబంధించిన ఎక్స్‌ప‌ర్ట్స్‌తో ఫేస్‌బుక్ ప‌నిచేస్తోంది. దాని వ‌ల్ల‌.. అప్ఘాన్ భాష‌ల్లో పోస్ట్ అయ్యే తాలిబ‌న్ కంటెంట్ మీద కూడా దృష్టి సారించే అవ‌కాశం ఉంటుంది.

తాలిబ‌న్‌.. అనేది ఒక టెర్ర‌రిస్ట్ సంస్థ‌. ఆ సంస్థ‌కు సంబంధించిన స‌మాచారం కానీ.. అకౌంట్లు కానీ.. ఫేస్‌బుక్‌లో ఉండ‌టానికి వీలు లేదు. అందుకే తాలిబ‌న్ అనుకూల‌మైన స‌మాచారాన్ని మొత్తం తొల‌గిస్తున్నాం. యూఎస్ చ‌ట్టం ప్ర‌కారం.. తాలిబ‌న్‌ను టెర్ర‌రిస్టు ఆర్గ‌నైజేష‌న్‌గా గుర్తించి.. దానిపై ఆంక్ష‌లు విధించారు. కాబ‌ట్టి.. మా ఆర్గ‌నైజేస‌న్ పాల‌సీ ప్ర‌కారం.. ఆ సంస్థ‌ను మేము బ్యాన్ చేస్తున్నాం.. అని ఫేస్‌బుక్ ప్ర‌తినిధి మీడియాకు వెల్ల‌డించారు.

ఫేస్‌బుక్‌తో పాటు.. త‌మ అనుబంధ నెట్‌వ‌ర్క్స్ వాట్స‌ప్‌, ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా తాలిబ‌న్ అకౌంట్ల‌ను బ్యాన్ చేస్తామ‌ని.. ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. అయితే.. తాలిబ‌న్ సంస్థ‌.. చాల ఏళ్ల నుంచి సోష‌ల్ మీడియా ద్వారా త‌మ కార్య‌క‌లాపాల‌ను సాగించింది. తాలిబ‌న్లు స‌ప‌రేట్‌గా ఒక వాట్స‌ప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకొని.. దాని ద్వారా త‌మ కార్య‌క‌లాపాల‌ను సాగిస్తున్న‌ట్టు ఫేస్‌బుక్ దృష్టికి వ‌చ్చింది. దానిపై కూడా త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు తీసుకొని.. ఆ వాట్స‌ప్ గ్రూప్‌ను తొల‌గిస్తామ‌ని ఫేస్‌బుక్ వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే.. తాలిబ‌న్ సంస్థ‌కు ప‌నిచేసేవాళ్లు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. అప్ఘాన్‌ను తాము సొంతం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. ఫేస్‌బుక్ ఈ నిర్ణ‌యం త‌ర్వాత‌.. ట్విట్ట‌ర్‌తో పాటు.. మిగ‌తా సోష‌ల్ మీడియా సంస్థ‌లు కూడా తాలిబ‌న్ కంటెంట్‌పై దృష్టి సారించాయి. తాలిబ‌న్ కంటెంట్‌పై త్వ‌ర‌లోనే మిగితా సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్ కూడా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.