అంతర్జాతీయం

అందరికీ క్షమాభిక్ష.. శాంతి వచనాలు వల్లెవేస్తూ తాలిబన్లు

  • గత సర్కారుకు సాయపడ్డ వారినీ ఏమీ చేయబోం
  • ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలి
  • మహిళలు మా ప్రభుత్వంలో భాగంకావొచ్చు
  • శాంతి వచనాలు వల్లెవేస్తూ తాలిబన్ల కీలక ప్రకటన
  • పౌరుల భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నట్టు వెల్లడి
  • తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సాలేహ్‌
  • కాబూల్‌లో తిష్టవేసిన ఐఎస్‌, జైషే, లష్కరే ఉగ్రవాదులు

ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల రాజ్యస్థాపనతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా శాంతిమంత్రాన్ని జపించారు. ఆఫ్ఘన్‌ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి, విదేశీ బలగాలకు సహాయ, సహకారాలు అందించిన వారిని కూడా క్షమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు తమ ప్రభుత్వంలో చేరొచ్చన్నారు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. మహిళలు బాధితులుగా మారడం తమకు ఇష్టంలేదన్నారు. ప్రజలంతా పూర్తి భరోసా, విశ్వాసంతో రోజూవారీ కార్యకలాపాలను చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే తమ వైఖరిలో మార్పు వచ్చినట్టు చెప్పారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిందిగా ఫైటర్లకు సూచించారు. మరోవైపు, ఇస్టామిక్‌ స్టేట్‌, జైషే మహమ్మద్‌, లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు కాబూల్‌లో ప్రవేశించినట్టు వార్తలు వస్తున్నాయి.

నేనే ఆపద్ధర్మ అధ్యక్షుడిని..
ఆఫ్ఘన్‌కి ప్రస్తుతం తానే ఆపద్ధర్మ అధ్యక్షుడినని ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ ప్రకటించుకున్నారు. ‘అధ్యక్షుడు మరణించడం, రాజీనామాచేయడం, దేశం వదిలివెళ్లిపోవడం తదితర సందర్భాల్లో మాజీ ఉపాధ్యక్షుడే దేశానికి ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతాడు. ప్రస్తుతం నేనే ఆఫ్ఘన్‌కు అధ్యక్షుడిని. అందరి మద్దతు కూడగడతున్నా’ అని ట్వీట్‌ చేశారు. తాను ఎన్నటికీ తాలిబన్లకు తలవంచబోనని స్పష్టం చేశారు.

‘షరియా’కు లోబడే మహిళలకు హక్కులు
ఆఫ్ఘనిస్తాన్‌ను నియంత్రణలోకి తీసుకున్న అనంతరం తాలిబన్లు మంగళవారం సాయంత్రం తొలి అధికారిక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఏ దేశంతోనూ తాము యుద్ధం చేసే ఆలోచనలో లేనట్టు పేర్కొన్నారు. షరియా చట్టాల ప్రకారమే మహిళా హక్కులను గౌరవిస్తామన్నారు. పౌరులు, అధికారుల ఇండ్లల్లోకి చొరబడి సోదాలు నిర్వహించబోమన్నారు. త్వరలోనే ఆఫ్ఘన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 1990లోని తాలిబన్లకు, ప్రస్తుత తాలిబన్లకు సిద్ధాంతాలు, నమ్మకాల విషయంలో ఎలాంటి తేడాలు లేవని పేర్కొన్నారు. కీలక అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇవి..

మహిళలు: షరియా చట్టాల ప్రకారం మహిళలకు హక్కులు ఉంటాయి. ఈ చట్టానికి లోబడిన మహిళలపై ఎలాంటి వివక్ష చూపబోం. కొత్త ప్రభుత్వంలో వారి భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం.

ప్రభుత్వ ఉద్యోగులు: గతంలో అమెరికా దళాలతో పనిచేసిన ఎవరి ఇంట్లోనూ సోదాలు చేపట్టబోం. ప్రభుత్వ ఉద్యోగులను, అందరినీ క్షమించాం.

హింస: గతంలో జరిగిన యుద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి. అయితే ఇది ప్రమాదవశాత్తుతో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.

మీడియా: ప్రైవేట్‌ మీడియా స్వతంత్రంగా, తటస్థంగా ఉండాలి. జాతీయ ప్రయోజనాలు, ఇస్లామిక్‌ విలువలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి.