చిన్నప్పుడు సినిమాల్లో పోలీసులను చూడగానే ఎక్కడలేని ఉత్సాహం. ఆ యూనిఫాం, ఆ తెగింపు, ఆ దూకుడు భలేగా నచ్చుతాయి. ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ కావాలనుకొంటాం. థియేటర్‌నుంచి బయటికొచ్చిన మరుక్షణమే, కలలన్నీ గాల్లో కలిసిపోతాయి. కానీ, ఆమె మాత్రం తన ఆశయాన్ని గుండె లోతుల్లో దాచుకుంది. చక్కగా చదువుకుంది. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ నిపుణురాలిగా ప్రస్థానం మొదలుపెట్టింది. భారీ వేతనం అందుకుంది. అయినా చిన్నప్పటి కలనుమర్చిపోలేదు. దాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసింది. రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించింది. తెలంగాణ కేడర్‌కు వచ్చిన తొలి తెలంగాణ మహిళాఐపీఎస్‌గా గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాదీ యువతి.. అపూర్వారావు ఐపీఎస్. ప్రస్తుతం, వనపర్తిఎస్పీగా సేవలు అందిస్తున్న అపూర్వను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మా ఇంట్లో ఐఏఎస్‌లు లేరు. ఐపీఎస్‌లు లేరు. కానీ, చిన్నప్పటి నుంచీ నాకు పోలీస్ కావాలని కోరిక. సినిమాల్లో పోలీసు పాత్రలను చూసినప్పుడల్లా ‘నేను కూడా ఇలా ఉంటే.. ’ అనుకునేదాన్ని. మా నాన్న సివిల్ కాంట్రాక్టర్. అమ్మ గృహిణి. నాకు ఓ అక్క. బీటెక్ తర్వాత, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. మంచి కంపెనీ, మంచి జీతం. మూడేండ్లు అక్కడే పనిచేశాను. కానీ, లక్ష్యాన్ని మరచిపోలేదు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయాను. రెండోసారి మరింత కష్టపడ్డాను. రోజూ ఆఫీస్ నుంచి రాగానే పుస్తకాలు ముందేసుకొనేదాన్ని. వీకెండ్స్ కూడా ప్రిపరేషన్‌కే అంకితం. ఉద్యోగం, చదువు రెండూ చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నా. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సంగతి ఇంట్లో చెప్పలేదు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తయి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాతే నాన్నతో చెప్పాను. చాలా సంతోషించారు. మా అమ్మ సాధారణ గృహిణే. కానీ, విద్యావంతురాలు. చిన్నప్పటి నుంచీ మా చదువుల బాధ్యతంతా తనే చూసుకునేది. మా అక్క కూడా చాలా ప్రోత్సహించేది.
నిబద్ధతతో నేను 2014లో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. నన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. దీంతో మా కొలీగ్స్ ‘తెలంగాణ ఐపీఎస్’ అంటుంటారు నన్ను. అలా పిలుస్తున్నప్పుడు గర్వంగా ఉంటుంది. రాష్ట్ర అవతరణ తర్వాత ఐపీఎస్‌కు ఎంపికైన తొలి తెలంగాణ మహిళను నేనే అనుకుంటా! శిక్షణ తర్వాత గోదావరిఖని ఏఎస్పీగా కొన్నాళ్లు పనిచేశాను. సీఐడీ ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించాను. తర్వాత వనపర్తి జిల్లాకు ఎస్పీగా వచ్చాను. నాటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, సాధ్యమైనంతలో సామాజిక కార్యక్రమాలూ చేపడుతున్నా. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చక్కటి సంపాదనతో విలాసవంతంగా బతకొచ్చు. కానీ, సమాజం కోసం పని చేస్తున్నప్పుడు కలిగే సంతృప్తి ముందు అవన్నీ దిగదుడుపే.
మహిళల రక్షణకు
మహిళలు అన్ని రంగాల్లో తమను తాము రుజువు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఆత్మాభిమానంతో బతుకుతున్నారు. అయితే, పనిచేసే చోట ఎన్నో సవాళ్లు. ఆఫీసు, కాలేజీ, కార్ఖానా.. ఎక్కడైనా సరే లైంగిక వేధింపులు, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైతే, తక్షణం మాకు సమాచారం అందించేలా మహిళా ఉద్యోగులతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో మామూలు ఉద్యోగిని నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఉంటారు. ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా చిన్న మెసేజ్ చాలు, వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. వ్యక్తిగతంగా సమాచారం అందించినా రంగంలోకి దిగుతాం. కోటీశ్వరులైనా, పేదలైనా.. పోలీసులను ఆశ్రయిస్తే చట్టం అమలులో తేడా ఉండదు. పోలీసులపై నమ్మకం కలిగేలా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానం అమలు చేస్తున్నాం.
మరింత ప్రోత్సహించాలి
తగిన ప్రోత్సాహం అందిస్తే అమ్మాయిలు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఆడపిల్లపై వివక్ష తరతరాలుగా వస్తున్నది. కుటుంబాల్లో ఆడపిల్లకు రెండో ప్రాధాన్యం ఇచ్చే రోజులు పోవాలి. వాళ్లకు నచ్చింది చదివే స్వేచ్ఛనివ్వాలి. ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాలి. బాల్యం నుంచే సామాజిక చైతన్యం కలిగించాలి. అమ్మాయిలు కూడా చిన్నచిన్న విషయాలకు అధైర్యపడొద్దు. ఆత్మన్యూనతకు గురికావద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడే క్రీడాకారిణులుగా, విద్యావేత్తలుగా, పరిపాలనా దక్షులుగా, పాలకులుగా ఎంచుకున్న రంగంలో ఘన విజయం సాధిస్తారు.
అదనపు సేవలెన్నో..
వనపర్తి ఎస్పీగా శాంతిభద్రతలు కాపాడుతూనే ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు అపూర్వారావు. ఐటీ నేపథ్యం కావడంతో జిల్లాలో పలు జాబ్ మేళాలు నిర్వహించారు. వాటిద్వారా, దాదాపు 240 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగం రావడం విశేషం. అంతేకాదు, పోలీస్ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న వారిని ఎంపిక చేసి, సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న 500 మందిలో దాదాపు 200 మంది ఎస్సైలుగా, కానిస్టేబుళ్లుగా కొలువులు సాధించారు. వీరిలో పలువురు మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు గ్రామీణ మహిళలకు కారు, ట్రాక్టర్ డ్రైవింగ్‌లో శిక్షణ అందించి, లైసెన్స్‌లు అందజేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థినులకు వివిధ ఆత్మరక్షణ మెళకువలు చెప్పించారు.
… రాందేని చంద్రమౌళి
గుంటి వినోద్‌సాగర్